ArticlesNews

సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ

60views

సింహాద్రి అప్పన్నా.. అని ఆర్తితో పిలిస్తే అభయహస్తం అందించే స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడు. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ మహా విష్ణువు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. చందన పరిమళాలు, సంపెంగ సౌరభాలతో శోభిల్లుతున్న సింహాచల క్షేత్రంలోని ప్రధాన ఉత్సవాల్లో ఒకటి గిరి ప్రదక్షిణ. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర కాలినడకన ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని భక్తులు భావిస్తారు. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని శనివారం గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.

శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ(గిరి ప్రదక్షిణ) శనివారం జరుగుతోంది. ఈసారి దాదాపు 5 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సింహాచలం, రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్‌, ఫైర్‌, ఎకై ్సజ్‌ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 22 ప్రదేశాల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా 290 తాత్కాలిక మరుగుదొడ్లు, 11 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 12 చోట్ల 17 అంబులెన్స్‌లు, 9 జనరేటర్లు, ఆరు పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు.

సాయంత్రం 4 గం.కు పుష్పరథం ప్రారంభం
కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పరథం ప్రారంభవుతుంది. స్వామి మూలవిరాట్‌, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

ఇవీ దర్శన సమయాలు : 20వ తేదీ ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 21 ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు అందజేస్తారు. తిరిగి సాయత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు, రాత్రి 8.30 గంటల నుంచి 9 వరకు భక్తులకు దర్శనాలు లభిస్తాయి.

21న ఆలయ ప్రదక్షిణలు : సింహగిరిపై 21న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారు జామున 3 గంటల నుంచి అనుమతిస్తారు. భక్తులంతా ఆలయ బాహ్య ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.

పుష్పరథం తిరిగే మార్గం
తొలిపావంచా, అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్‌ జైల్‌, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్కు, అప్పుఘర్‌, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది.

భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం
సింహాచలంలోని తొలి పావంచా, అడవివరం, పైనాపిల్‌ కాలనీ, సెంట్రల్‌ జైల్‌, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్క్‌, అప్పుఘర్‌, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్‌, పోర్టు డీఎల్‌బీ క్వార్టర్స్‌, కప్పరాడ, మురళీనగర్‌, మాధవధార, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, లక్ష్మీనగర్‌, కుమారి కల్యాణ మండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకోవాలి.

ఉచిత ప్రయాణం
21వ తేదీ ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండపై నుంచి దిగువకు భక్తులను దేవస్థానం బస్సులతో పాటు, దేవస్థానం నగదు చెల్లించిన 45 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరవేస్తారు.