News

సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు.. వారికి పాక్ నుంచే నిధులు..!

56views

జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. పాక్‌ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భారీగా సాయుధులైన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది చనిపోయారు. మరోవైపు ఉగ్రవాదులకు పాక్ నుంచి అందుతున్న నిధులు, శిబిరాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడయ్యింది.

ఉగ్రవాదులను భారత్‌కు పంపుతున్న పాక్

తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, మాజీ ఎస్‌ఎస్‌జీలు, కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి భారతదేశానికి పంపుతోందని తెలుస్తోంది. అలాగే ఈ ఉగ్రవాదులకు ఎం4 లాంటి ఖరీదైన ఆయుధాలు, బుల్లెట్లను అందిస్తోంది. చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సాయపడేలా గైడ్‌లకు కూడా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అందజేస్తోంది. అలాగే స్మార్ట్‌ ఫోన్లు, రేడియో సెట్లు, వై ఎస్ఎంఎస్‌లను ఉగ్రవాదులు విరివిగా వినియోగిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.

తనిఖీలు ముమ్మరం చేసిన ఆర్మీ

భారత సైన్యం సరిహద్దుల్లోని కంచెలు, సొరంగాల తనిఖీని ముమ్మరం చేసింది. భారతదేశంలోకి చొరబడిన ఉగ్రవాదులకు ఆహారం సహా ఇతర అవసరాలు కోసం ఐదారువేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో పాక్‌లో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్‌ చేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతోంది. యువతను ఉగ్రవాదులుగా మార్చడంలో విఫలమైన పాకిస్థాన్.. ఇప్పుడు ఉగ్రవాదులను డబ్బుతో ఆకర్షిస్తోంది. ఇలాంటి శిబిరాలు సరిహద్దుల్లోని నికియాల్, జాంద్రుత్‌, ఖురేటా కోట్లి, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమన్‌, కోట్‌కోటేరాలో ఉన్నట్లు తెలుస్తోంది.