ArticlesNews

చందనానికి వందనం

90views

చందనం భారతీయులకు ఒక వైభవం. చందనం శుభసూచకం, ఆరోగ్యప్రదం. అధ్యాత్మికంగా ఎంతో అవసరమైంది. శుభకార్యక్రమాల్లో స్త్రీలకు మెడ భాగానికి, పురుషులకు అరచేతుల వెనక చందనం పూయడం ఆచారం. ఇంటికి వచ్చిన అతిథులకు ఒకప్పుడు చందనం ఇవ్వకుండా పంపేవారు కాదు. షోడశోపచార పూజలో చందనం సమర్పించడం ఒక ఉపచారం. శివుడి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. సింహాచలంలోని వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఎప్పుడూ చందనపు పూతతో దర్శనమిస్తూ ఉంటాడు. అక్షయ తదియ నాడు చందనోత్సవం జరుపుతారు. లలితా దేవి నామాలలో ‘చందన ద్రవ దిగ్ధాంగీ’ అని ఒకనామం ఉంది. చందనమంటే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట! విష్ణువుకు ఉపయోగించే చందనంలో ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. తుంబురుని గానాన్ని, వీణా వాదనను మెచ్చిన విష్ణువు తాను ఉపయోగించే చందనాన్ని అతడికి పూయడం దానికున్న విశిష్టతను తెలియజేస్తుంది. అడగ్గానే చందన లేపనాలిచ్చిన త్రివక్ర వంకర తీర్చి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు.

చందనాన్ని నుదుటిమీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా, తల నొప్పి రాకుండా చూస్తుందని పెద్దలు చెబుతారు. హృదయంపై రాసుకోవడం వల్ల గుండెకు మేలు కలుగుతుందని అంటారు. మహిళలు గంధాన్ని మెడకు, దవడలకు రాసుకుంటారు. రెండు వేళ్లతో ఆ ప్రాంతాల్లో గంధం పూయడం వల్ల విశుద్ధి(అయిదో ప్రధాన)చక్రానికి కాపుదల ఉంటుందని భావిస్తారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను సంప్రదాయంలో మిళితం చేసిన సంస్కృతి మనది. చందనం అమూల్యమైన మూలిక. ఆహ్లాదకరమైన వాసనతో దుర్గంధాన్ని పోగొడుతుంది. క్రిమిసంహారిణి కూడా. చందనాన్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు.

-నూతి శివానందం