News

దానం ఎలా ఉండాలి?

58views

గురు నానక్‌ తన శిష్యుడు మర్దానాతో కలిసి దేశ సంచారం చేస్తున్నారు. మర్దానా ఒకసారి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. అక్కడి ప్రజలు అతణ్ని గొప్ప దైవభక్తుడిగా భావించి ఆశీర్వాదం తీసుకున్నారు. రకరకాలైన తినుబండారాలతో పాటు పట్టు, నూలు, ఉన్ని దుస్తులు, అత్తరులు కానుకగా ఇచ్చారు. వాటిని మూటగట్టుకొని మర్దానా ఆనందంగా గురువు దగ్గరికి వచ్చాడు. తన ఆజ్ఞను అతిక్రమించి అలాంటి వాటిని తెచ్చినందుకు గురు నానక్‌ ఆగ్రహించారు. వాటిని పారవేయాలని ఆజ్ఞాపించారు. మర్దానా గురువు చెప్పినట్లే చేశాడు. దానం విషయంలో అతడికో సందేహం వచ్చింది. ‘ఆర్తులకు ఎవరైనా దానం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడా?’ అని మర్దానా ప్రశ్నించాడు. ‘ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, ఒంటి మీద సరైన దుస్తులు లేనివారికి వస్త్రాలు అందించడం వల్ల దాతకు భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. అయితే, ఆ దానం తాను కష్టపడి సంపాదించిన దానినుంచే చేయాలి. దానాన్ని స్వీకరించే వ్యక్తీ తనకు అవసరమైనంతే తీసుకోవాలి’ అని గురు నానక్‌ బదులిచ్చారు.