News

ఆర్.ఎస్.ఎస్.ను చూసి నేర్చుకోవాలి: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్ సింగ్ సూచన

59views

ఆర్.ఎస్.ఎస్.‌ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నర్సింగ్ కాలేజీ కుంభకోణం, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జబల్‌పూర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక సందేశాన్ని ప్రభావవంతంగా ఎలా అందించాలో, సంస్థను ఎలా విస్తరించాలో అర్.ఎస్.ఎస్.‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ఇక ఇటీవలే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆర్.‌ఎస్.ఎస్. పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు నిత్యం దేశం, సమాజం అంటూ ఎంతో నిస్వార్థంగా ఉంటారని, వారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదిలా ఉంటే, భారతీయ సంస్కృతి పట్ల శ్రద్ధ, సామాజిక రంగంలో పని చేయాలన్న ఆసక్తి ఉన్నవారు సంఘ కార్యంలో చేరాలనుకుంటున్నారు. ఇలాంటివారిలో ఐ.టీ. రంగానికి చెందిన వారితో పాటు ఇతర రంగాలకు చెందినవారు కూడా ఉన్నారు. దేశంలోని యువత సంఘ్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి యేటా 1.25 లక్షల మంది ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సంఘ్‌ చేపట్టే వివిధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది కూడా జూన్ నెలాఖరు నాటికి 66,529 మంది సంఘ్‌లో చేరేందుకు సంప్రదించారు.