ArticlesNews

మిస్టర్ డిఫెక్ట్.. మానసిక వైకల్యానికి మరో రూపమే “మహారాజ్”!

56views

బహుశా.. ఏ దేశంలోనైనా రెండే రెండు శక్తులు పనిచేస్తుంటాయి. ఒకటి దేశాన్ని ముందుకు నడిపించేది.. మరొకటి దేశాన్ని మరింత వెనక్కి నెట్టేసేది. విచిత్రమేంటంటే.. ఆ దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుని.. భవిష్యత్తును మరింత పటిష్టం చేసే వర్గానికి ఛాందసవాదమనే ముద్రవేసి.. ఆ దేశ ఔన్నత్యాన్ని కాలరాచి.. లేని చెడును దేశానికి, సమాజానికి ఆపాదించి.. ఆ దేశ రథసారథులైన యువతను పెడదారి పట్టించే యత్నం చేసేవాళ్లకేమో.. అభ్యుదయవాదులని పేరు పెట్టేస్తున్నారు.

అలాంటి దౌర్భాగ్య, ఆధునికమని చెప్పుకునే వాదనలతో.. దేశ యువతరాన్ని తప్పుదోవ పట్టించే పెక్యులరిస్టులలో మొదటివాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అతనే ఫ్యాన్స్తో మిస్టర్ పర్ఫెక్ట్ అని డబ్బా కొట్టించుకునే అమీర్ ఖాన్. ఎప్పటిలాగే “మహారాజ్” అనే సినిమాతో, మరోసారి రెండువందల ఏళ్ల నాటి.. ఒక నీతి తప్పిన రాజు చరిత్రను కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతికి ఆపాదించిన అమీరాఖాన్ మరోసారి శునకానందం పొందాడనే చెప్పాలి. దేవాలయం అనేది ఒక మతానికో, కులానికో సంబంధించింది కాదు.. అది మన దేశ మాన బిందువు.. మన సంస్కృతి, సంప్రదాయాల కేంద్రమనీ… అక్కడ అడుగుపెట్టిన వారు ప్రాపంచిక విషయాలు, కామక్రోధాల వంటి అరిషడ్వర్గాలను మరిచిపోయి కేవలం ఆధ్యాత్మికంలో కాలం గడుపుతారనీ తెలియని అజ్ఞాని అమీర్ ఖాన్. ఎందుకంటే పుట్టి బుద్దెరిగినప్పటి నుంచీ తాము నమ్మినవాడు మాత్రమే దేవుడు అని నరనరాల్లో జీర్ణించుకున్న ఈ అభ్యుదయఖాన్ కు.. వసుధైక కుటుంబకమ్ అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనీ.. సర్వేజనా సుఖినోభవంతు అంటే.. అందరూ బాగుండాలంటూ ఆశీర్వదించే దేవాలయం గొప్పతనం ఎలా తెలుస్తుంది?

ఇక.. ఏ కాలంలోనైనా మహానుభావులున్నట్టే.. మహా మూర్ఖులూ, మహా దుర్మార్గులు కూడా ఉంటారు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వాళ్లలో భయాన్ని, మూఢభక్తిని పెంపొందించి తమ పబ్బం గడుపుకునే దురాశా వరులూ ఉండేవారు.. ఉన్నారు.. ఉంటూనే ఉంటారు. అలాంటి ఒక రాజే.. తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన “మహారాజ్” చిత్రంలోని “జేజే” అనే పాత్రధారి. గుజరాత్ ప్రాంతం లోని ఒక పట్టణంలో జేజే అనబడే జాదూనాథ్ జీ బ్రిజురతన్ ఒక ఆలయానికి ధర్మకర్తగా.. అక్కడి మహారాజుగా ఉంటూ ఆ ఆలయంలో చరణసేవ పేరుతో అకృత్యాలు చేస్తుంటాడు. దానిని ఎదురించిన సంఘ సంస్కర్త, సత్యప్రకాశ్ పత్రిక స్థాపకుడు కర్సన్ దాస్ మూళీ కథే.. ఈ మహారాజ్ సినిమా. అక్కడి మహారాజు జేజే సాక్షాత్ దైవాంశ సంభూతుడిగా ప్రజల పూజలు అందుకుంటూ ఉంటాడు. రాజుగారి దర్శనమే ఓ మహాభాగ్యం.. అంతేనా.. ఆయనను కాలు సైతం నేల మీద పెట్టనీయకుండా ప్రతి అడుగూ తమ అరచేతులతో కవర్ చేసే మూఢభక్తి ప్రదర్శకులైన ప్రజలను ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే ఆ రాజు చరణసేవ పేరుతో తాను కన్నేసిన కన్యను రాజావారికి భక్తితో సమర్పించే కన్నవారికీ ఆ పట్టణంలో కొదువలేదు. ఒక్క కూతుళ్లనే కాదు.. తమ భార్యలు, అక్కాచెల్లెళ్లూ ఇలా అందరినీ రాజుగారి చరణసేవకు సమర్పించే ఆ దుస్సంప్రదా యాన్ని ఒంటి చేత్తో ఎదురించే కర్సన్ దాస్ పాత్రను అమీరాఖాన్ కుమారుడు పోషించాడు. నవయువ కుడు, ఔత్సాహిక జర్నలిస్టు, అభ్యుదయవాది అయిన కర్సను “కిషోరి” అనే ఓ ప్రియురాలుంటుంది. దేవాలయానికి సంబంధించిన ఒక ఉత్సవం తర్వాత.. ఆమె జేజే చరణ సేవకు ఎన్నికవుతుంది. అత్యాచారానికి గురి అవుతుంది. దురదృష్టవశాత్తూ ఆ ఘోరాన్ని హీరో కళ్లారా చూస్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగే కొన్న సంఘటనలు చూసి తాను మోసపోయానని, తనలాగే అక్కడ అనేకమంది స్త్రీలు అత్యాచారాలకు గురి అవుతున్నారని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది కిషోరి. అప్పటికే మూఢా చారాలను వ్యతిరేకించే కర్సన్ దాస్, ప్రియురాలి దావుతో అక్కడి స్త్రీలకు న్యాయం చేయాలనీ, ఎలాగైన జేజే నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలనే పట్టుదలతో చేసే పోరాటమే మిగిలిన చిత్ర కథ. తన సత్యప్రకాశ్లో జేజే మోసాలను ఎండగట్టడం.. ఆ తర్వాత జేజే సత్యప్రకాశ్ పత్రికా కార్యాలయాన్ని తగుల బెట్టించటం వంటి దృశ్యాలు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత కొందరు మిత్రుల సహకారంతో మరో చోట పత్రికా కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్న కర్సన్.. జేజే అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచు తాడు. దీంతో కక్షగట్టిన జేజే కర్సన్పై పరువు నష్టం దావా వేస్తాడు.

1862లో బాంబే సుప్రీం కోర్టులో మహారాజు జేజే వేసిన పరువునష్టం దావాపై కర్సన్ మూల్జీ ఎలా పోరాడుతాడు..? జేజే తన అధికారాన్ని దుర్విని యోగం చేసి భక్తి ముసుగులో అక్కడి స్త్రీలపై ఎలా అత్యాచారాలు కొనసాగిస్తున్నా డనే నిజాన్ని కర్సన్ బట్టబయలు చేయటమే కథ. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని విర్రవీగుతున్న జేజే దుర్భుద్ధిని, అతనికి వైద్యం చేసిన ఒక ప్రముఖ వైద్యుడి సాయంతోనే కోర్టులో రుజువు చేస్తాడు కర్సన్. అనేకమందితో సంభోగించే మహారాజు జేజే సుఖవ్యాధులతో బాధపడుతున్నాడనే విషయం కోర్టు సాక్షిగా రుజువు కావటం.. కోర్టుకు హాజరైన మహిళల్లో ఒకరొక్కరుగా ముందుకు వచ్చి అతని అత్యాచారాల గురించి వెల్లడించటంతో “మహరాజ్” చిత్ర కథ ముగుస్తుంది.

నిజానికి సినిమా చిత్రణపరంగా, సాంకేతిక విలువల ఆధారంగా చూస్తే 24 ఫ్రేమ్స్ అద్భుతంగా చిత్రీకరించారనే ఒప్పుకోవాలి. 1850 నాటి ఒక పట్టణం ఎలా ఉంటుందనే దానితో పాటు, అక్కడి ప్రజల జీవన విధానం కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలు లాంటి వన్నీ చాలా కళాత్మకంగా, సహజసిద్ధంగా చిత్రించారు. నటీనటులు సైతం వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. కాకపోతే.. ఇలాంటి ఓ సినిమాతో మిస్టర్ డిఫెక్ట్ మరోసారి హిందూత్వంపై తన ద్వేషాన్ని.. అక్కసును కాస్త శృతి మించి వెళ్లగక్కినట్టు తెలిసిపోతోంది.

ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన అనేక మంది దుర్మార్గ రాజులున్నారు. అంతమాత్రాన ఆ దేశాలో, ఆ సమాజాలో దుర్మార్గమైనవి కావు. అలాగే ఓ రెండువందల ఏళ్ల క్రితం నాటి ఓ పాపాత్ముడి కథను తాజాగా తెరకెక్కించి.. దేవాలయాలంటేనే అత్యాచార కేంద్రాలని ప్రచారం చేయాలనుకున్న మిస్టర్ డిఫెక్ట్ దురాక్రమణా సరికాదు. ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల విదేశీ దురాక్రమణ దారుల దాడులను తట్టుకుని నిలిచిన సంస్కృతి మన భారతదేశానిది. మీరు దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో కళ్లు, ముక్కు చెవులు విరిగిపోయి.. తునాతునకలై కనిపించే అద్భుత శిల్పకళారూపాలు ఆనాటి దురాక్రమణ దారుల దాడులను మనకు గుర్తు చేస్తాయి. అలాంటిది.. ఓ వైపు యువతరాన్ని నిర్వీర్యం చేయటానికి డ్రగ్స్, గంజాయి వంటి రూపాల్లో జరుగుతున్న దాడులను అడ్డుకోవాల్సింది పోయి.. నిత్యం మొబైల్ ఫోన్లలో కొలువుతీరే యువతీ యువకులకు ఎంతో కొంత సంస్కారాన్ని అందించే.. దేవాలయాల మీద మిస్టర్ డిఫెక్ట్ విషం చిమ్మటం.. నాటి గజనీ, బాబర్ దండయాత్రలకంటే తక్కువేం కాదని ఎలా అనుకోగలం?

అసలు అమీర్ ఖాన్ అండ్ కో.. అనబడే ఇలాంటి తుకుడే గ్యాంగ్ ఓపికకు మెచ్చుకోవాలి. ఎందరో సంస్కర్తల బోధనలు, కృషి, త్యాగాల ఫలితంగా రూపుదిద్దుకున్న ఒక నవ భారతావనిని మళ్లీ పాతాళానికి నెట్టే ప్రయత్నం పదేపదే చేయటం. పైగా పీకే, మహారాజ్ ఇంకా ఇలాంటి అనేక దిక్కుమాలిన సినిమాలను తీస్తూ కూడా.. ఈ దేశంలో తాము స్వేచ్ఛగా బతకలేకపోతున్నామని వెధవ ఏడుపులొకటి!

-రామ్ కె