ArticlesNews

వందే శ్రీపురుషోత్తమం

90views

( జులై 17 – తొలి ఏకాదశి )

‘తిథుల్లో నేను ఏకాదశిని’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్త్యం అర్థమవుతుంది. ‘ఏకాదశీ వ్రతమిదం వ్రతానాం ప్రవరం స్మృతమ్‌’… వ్రతాల్లోకెల్లా శ్రేష్ఠమైంది ఈ ఏకాదశి వ్రతం. లౌకిక వాంఛలు లేని మోక్షసాధక వ్రతం ఇది.

శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి… ఇలా నెలకు రెండుసార్ల చొప్పున సంవత్సర కాలంలో 24 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుస్తాయి. ప్రతి ఏకాదశికీ ఒక ప్రత్యేకమైన పేరు, విశిష్టమైన ఫలసిద్ధి ఉన్నాయి. తొలి ఏకాదశి, పుత్రదా ఏకాదశి, చిలుకు ఏకాదశి, నిర్జల ఏకాదశి, సఫల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ముఖ్యమైనవి. వీటిలో తొలి ఏకాదశి శయన ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధమయ్యాయి.

పౌర్ణమి నాడు పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడి సంయోగంతో ఏర్పడే మాసమే ఆషాఢం. పూర్వం ఆషాఢాన్నే సంవత్సరంలో తొలి మాసంగా పరిగణించేవారు. శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించి యోగనిద్రలోకి వెళ్లే శుభదినమే ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి. సంవత్సర ఆరంభంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటున్నాం. నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి శయన ఏకాదశి అనీ పిలుచుకుంటున్నాం. పండుగలన్నింటిలోకి మొట్టమొదటిది కనుక ఇదెంతో విశిష్టమైంది.

చాతుర్మాస్య దీక్ష
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి మళ్లీ నాలుగు నెలల తరవాత… అంటే, కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. స్వామి నిద్రించి ఉండటం వల్ల ఈ ఏకాదశి నుంచి రాత్రి సమయాలు పెరుగుతాయి. ఈ నాలుగు నెలలూ కామ క్రోధాదులను విడిచిపెట్టి, చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. సాత్వికాహారమే తీసుకుంటారు. ఏకాదశి వ్రతం ఆచరించి, విష్ణువును ఆరాధిస్తారు.

న గాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్‌
న కాశ్యాః పరమం తీర్థం నచ ఏకాదశ్యాః సమం వ్రతం

గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం, కాశీని మించిన పుణ్యతీర్థం, ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదన్నది దీని భావం. ఆరోగ్య, మోక్ష కారకమైన తొలి ఏకాదశిని హరివాసరం, పేలాలపండుగ అనీ పిలుస్తారు.

ఆరోగ్య రక్షణ
ఏకాదశి వ్రత విధానంలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఉపవాస సమయంలో పేలపిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎండలు తగ్గి, వర్షాలు కురిసే సమయంలో అనేక రోగాలు సంక్రమించే అవకాశముంది. వాటికి విరుగుడుగా పనిచేస్తుందీ ప్రసాదం. ఒకసారే తినడం, నేలమీద పడుకోవడం, బ్రహ్మచర్యం, అహింసావ్రతం, ధ్యానముద్ర, దానధర్మాలు వంటి వాటిని చాతుర్మాస్య వ్రత కాలంలో ఆచరించడం ద్వారా ఆయురారోగ్యాలు, కార్యసిద్ధి, మోక్షప్రాప్తి లభిస్తాయి. తొలి ఏకాదశి రైతుల పండుగ కూడా. అతివృష్టి, అనావృష్టి కలగకూడదని కర్షకులు ప్రార్థిస్తారు. అలాగే కార్మికులు, చేతివృత్తుల వారు తొలి ఏకాదశి నుంచే కొత్త పనులు ప్రారంభిస్తారు.

పదకొండు దేనికి చిహ్నం?
ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం పదకొండు. ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులోకి తెచ్చుకొని భగవంతుణ్ని ధ్యానించాలన్నది ఏకాదశి ఇచ్చే సందేశం. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుంది.