News

కోటప్పకొండలో తొలి ఏకాదశి కోసం ఏర్పాట్లు

48views

తొలి ఏకాదశి సందర్భంగా నరసరావుపేట మండలం కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబులు ఆదేశించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రదక్షిణ మార్గం చదును చేయాలన్నారు. మార్గం ఆద్యంతం మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వన్య మృగాల నుంచి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

కొండ పైనా, కిందా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పాము కాటు మందులు మెడికల్ క్యాంపులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, ట్రాక్టర్లు, ఆటోలలో పరిమితికి లోబడి ప్రయాణీకులను మాత్రమే కొండ మీదకి అనుమతించాలన్నారు.

వేడుకల నిర్వహణలో భాగస్వాములయ్యే అధికారులకు, భక్తులకు చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడి పూజా సామాగ్రి ధరలు అదుపులో ఉండేలా చూడాలన్నారు. భక్తుల అవసరాన్ని బట్టి బస్సులు నడపాలని, బస్సులు నడిచే వేళలపై ప్రచారం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఆలయ ప్రసాదంలో నాణ్యత పాటించాలని, భక్తులకు వీలైనంత త్వరగా, ప్రశాంత వాతావరణంలో త్రికోటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.