ArticlesNews

ప్రతి రోజూ ఆధ్యాత్మిక పర్వమే..!

70views

కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా విభజించి ప్రకృతి ధర్మాన్ని అర్థం చేశారు. ఉత్తర, దక్షిణాయనాలుగా విడదీసి ఏ అయనంలో ఎటుగా పయనించాలో నిర్దేశించారు. ఇప్పుడు దక్షిణాయనానికి వేళ అయింది. ప్రకృతి విలక్షణంగా మారిపోయింది. ఉత్తరాయణం ముక్తికి మార్గమైతే.. ఆ దారికి చేరుకునే శక్తిని ప్రసాదించే పవిత్ర కాలం దక్షిణాయనం. ఈ పుణ్యకాలాన్ని ఆధ్యాత్మిక ప్రయాణానికి వినియోగించుకోవాలి.

దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయంగా చెబుతారు. రాత్రివేళ దుష్టశక్తులు బలం పుంజుకుంటాయి. దైవశక్తి కొంత సన్నగిల్లుతుంది. ప్రతికూల శక్తులు ప్రబలకుండా మానవ ప్రయత్నం అనివార్యం. దేవతల ప్రీత్యర్థం జపతపాలు చేయడం అత్యావశ్యకం. పారమార్థిక చింతన ఉన్నవారికి పర్వాలతో పనిలేదు. లౌకిక జీవనం కొనసాగించేవారికి అది సాధ్యపడదు. అందుకే, దక్షిణాయనంలో ప్రతినెలా విశేష పర్వదినాలు ఉండేలా మన రుషులు మార్గనిర్దేశం చేశారు. ఆషాఢం మొదలుకొని మార్గశిరం వరకు విశేష ఉత్సవాలు ఉండేలా పండుగలు వస్తుంటాయి.

ప్రతి నెలా పండుగలే..
దక్షిణాయనంలో మొదటి పండుగ ఆషాఢ శుక్ల ఏకాదశి. దీనినే తొలి ఏకాదశి అనీ, దేవశయన ఏకాదశి అనీ అంటారు. ఆనాటి నుంచి కార్తిక శుక్ల ద్వాదశి వరకు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. స్థితికారుడు నిద్రపోవడం ఏంటి? బడలిక తీర్చుకోవడానికి మనుషులు పోయేలాంటి నిద్ర కాదిది. శ్రీహరిది యోగనిద్ర. నిద్రాణంలోనూ ఉత్థానస్థితిలోనే ఉంటాడు దేవాదిదేవుడు. తన స్థితికార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే.. తపోనిష్ఠలో కూరుకుపోతాడు. అలా పాలకడలిలోని శేషతల్పం నుంచి వచ్చే ధనాత్మక తరంగాలు ఈ విశ్వానికి రక్షణ ఛత్రంలా కాపుకాస్తాయని పూర్వికుల విశ్వాసం. ఆషాఢ పౌర్ణమి అత్యంత ప్రభావవంతమైన పర్వదినం.

విష్ణురూపంగా భావించే వ్యాస మహర్షి జన్మించినది ఈరోజునే. వేదాలను విభజించి, పంచమవేదమైన భారతాన్ని అందించి, అష్టాదశ పురాణాలు లిఖించి, భక్తి భావనకు ఆయువుపట్టుగా భావించే భాగవతాన్ని రచించి.. జగతిని జాగృతం చేసిన జగద్గురువు ఆ మహనీయుడు. వ్యాస మహర్షిని స్మరిస్తూ.. ఆయన ప్రతిరూపంగా గురువులను పూజించుకునే పండుగ ఇది. సాధకులు తమ తపోబలాన్ని పెంచుకునేందుకు అనువైన తిథి.

దక్షిణాయనంలో వచ్చే మాసాల్లో పవిత్రమైనది శ్రావణం.  శ్రావణ వ్రతాలు ఆచరించడం వెనుక లౌకిక విశేషాలూ కనిపిస్తాయి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. శ్రావణంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుంటాయి. వ్యవసాయ పనులు జోరందుకుంటాయి. పూర్వం మగవాళ్లు శ్రావణం వచ్చిందంటే.. పొలం పనుల్లోనే నిమగ్నమయ్యేవారు. కర్తవ్యదీక్షలో ఉన్న పతులకు దైవీబలం సంప్రాప్తించాలనే భావనతో భార్యలు వ్రతాలు ఆచరించే సంప్రదాయం ఏర్పడింది.

శ్రావణంలో కృష్ణాష్టమిని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. బాలకృష్ణుడి ఆరాధనతో సంతానం సంప్రాప్తిస్తుందనీ, ఐశ్వర్యం సిద్ధిస్తుందనీ విశ్వాసం. భార్యాభర్తల అన్యోన్యతకు శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవాలని పెద్దల మాట. సోదరీ, సోదరుల మధ్య అన్యోన్యతను పంచుకునే రక్షాబంధన్‌ను శ్రావణ పౌర్ణమి నాడు చేసుకుంటారు. అనుబంధాలను పంచుకునే పండుగ ఇది.

భాద్రపదం గణపతి మాసం. వినాయక మంటపాలతో దేశమంతా ఆధ్యాత్మికతకు చిరునామాగా మారిపోతుంది. భక్తిభావంతోపాటు ఐక్యతను చాటిచెప్పే పండుగ ఇది. భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు కేటాయించారు పెద్దలు. ఉత్తరాయణం దేవతలు అనుగ్రహిస్తే, దక్షిణాయనం పితృదేవతల ఆశీస్సులు అందుతాయని శాస్త్ర వచనం. పితృపక్షాల్లో పితృ తర్పణాలు విడవడం మన సంప్రదాయం. కాలం చేసిన పెద్దలను తలచుకొని.. వారి పేరిట శక్తికొద్ది దానధర్మాలు చేయాలని శాస్త్రం నిర్దేశించింది. ఆ ప్రకారంగా దానం చేసిన వారి వంశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నది.

ఆశ్వయుజం ఆధ్యాత్మిక సాధకులకు ప్రీతికరమైన మాసం. దేవీ నవరాత్రులు శాక్తేయుల శక్తిసామర్థ్యాలు పెంచుకునే కాలం. చెడును ఎదిరించి నిలిచిన మంచికి పట్టం కడుతూ దసరా ఉత్సవాలు చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం పొందే అద్భుత పర్వం విజయదశమి. ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా చేసుకుంటాం. దీపాలు వెలిగించి చీకట్లను తొలగించుకుంటాం. మానవ మనుగడకు మూలాధారమైన సంపదల తల్లి మహాలక్ష్మిని ఆరాధించి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొంటాం.

కార్తికం పవిత్ర మాసం. అద్వైత భావాన్ని తెలియజేసే నెల ఇది. శివకేశవులను ఆరాధిస్తూ ధన్యత పొందుతారు భక్తులు. పరమేశ్వరుడికి నిత్యాభిషేకాలు, శ్రీహరికి నిత్య నివేదనలు.. నెలంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. కార్తికంలో వనభోజనాలు ఆహ్లాదంతోపాటు భక్తి భావాన్ని పెంపొందిస్తాయి.

మార్గశిరం మరో మహోన్నత మాసం. గీతాచార్యుడు మాసాల్లో తాను మార్గశిరాన్ని అని ప్రకటించాడు. భగవద్గీత ఆవిర్భవించింది కూడా ఈ నెలలోనే. అంతేకాదు శివుడి రూపమైన కాలభైరవుడు ఆవిర్భవించిందీ మార్గశిరంలోనే! ఇలా ప్రతినెలా పర్వాలతో కొనసాగే దక్షిణాయనం విలక్షణం కాక మరేమిటి? ఉత్తరాయణంలో ఉత్తమ మార్గం పొందడానికి కావాల్సిన శక్తిని పుంజుకోవడానికి దక్షిణాయనాన్ని వినియోగించుకోవాలి.

సూర్యుడు భూమికి దక్షిణ దిశలో సంచరించే మూడు రుతువుల (ఆరు నెలలు) కాలాన్ని దక్షిణాయనమనీ, భూమికి ఉత్తరదిశలో సంచరించే మూడు రుతువుల కాలాన్ని ఉత్తరాయణమని పేర్కొన్నారు. సూర్యుడు మేషరాశి మొదలుకొని ప్రతినెలా ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడు మకరంలోకి ప్రవేశించింది మొదలు మిథునం దాటే వరకుగల ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణం అని, కర్కాటక సంక్రమణం మొదలు ధనుస్సు దాటే వరకూ ఉన్న ఆరునెలల కాలాన్ని దక్షిణాయనం అని విభజించారు. ఉత్తరాయణం శుభకార్యాలకు అనువైనదైతే.. దక్షిణాయనం ఉపాసకులు అనుష్ఠానం చేసుకోవడానికి విశేషమైనదిగా చెబుతారు.