ArticlesNews

మాతృశక్తి స్వరూపిణి వందనీయ మౌసీజీ

56views

( జూలై 6 – లక్ష్మీబాయి కేల్కర్ జయంతి )

అది 1930వ దశకం. స్త్రీలకు విద్య సంగతి అటుంచితే, వారు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు. అయితే సంస్కారవంతమైన కుటుంబాన్ని సృష్టించడంతో పాటు సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో మహిళలదే ముఖ్యమైన పాత్ర అని ఆమె గుర్తించింది. దేశానికి నిస్వార్థంగా సేవ చేయడంతో పాటు పిల్లలకు ఉన్నత విలువలను అందించడంలో మహిళలను శక్తివంతులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు. ఆ బృహత్తర ఆలోచన నుంచే పురుడు పోసుకుంది రాష్ట్ర సేవికాసమితి. మాతృత్వం, సృజనాత్మకత, నాయకత్వం, సమాజానికి తోడ్పాటు వంటి కీలకాంశాల్లో శిక్షణ అందిస్తూ రాష్ట్ర సేవికాసమితి నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందుతోందంటే అందుకు కారణం వందనీయ లక్ష్మీబాయి కేల్కర్. ఆమెను అందరూ గౌరవంగా మౌసీజీ అని పిలుస్తారు.

మహిళా శక్తిని జాగృతం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్త లక్ష్మీబాయి కేల్కర్ 1905 జూలై 6, విక్రమశక 1827 సంవత్సరం, ఆషాఢ శుద్ధ దశమిన పుణెలో జన్మించారు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆమె జన్మదినం పండుగను ఈ సంవత్సరం జూలై 16న జరుపుకుంటున్నాము. యశోదాబాయి, భాస్కరరావు దాలే దంపతులకు నాగ్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీబాయి కేల్కర్‌కు వారు పెట్టిన పేరు కమల. పేరుకు తగ్గట్టే ఆమె చుట్టూ బానిసత్వం అనే బురద ఉన్నప్పటికీ తల్లిదండ్రుల వద్ద నుంచి లభించిన సంస్కారం, జాతీయభావం వీరి వ్యక్తిత్తం మీద చెరగని ముద్ర వేశాయి. ఆ రోజుల్లో లోకమాన్య తిలక్ సంపాదకత్వంలో వెలువడే కేసరి పత్రికను చదవడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహంగా పరిగణించేది. కానీ, కమల తల్లి యశోదాబాయి ఆ పత్రికను చదవడమే కాక తన చుట్టుపక్కల ఉన్న మహిళలను పోగు చేసి వారికి చదివి వినిపించేది. అలా తల్లి యశోదా ప్రోద్బలంతో కేసరి పత్రికను చదవడం ద్వారా కమలలో మాతృభూమి పట్ల ప్రేమ, సంస్థాగత సామర్థ్యం, ధైర్యసాహసాలు, నిర్భయ గుణం అలవడ్డాయి.

కమల తన నానమ్మతో కలిసి గో వధకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటమే ఆమెలో వాక్ శక్తిని, వినయాన్ని పెంపొందించాయి. ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కుల, మతాలకు అతీతంగా రోగులకు, పేదలకు ఆమె సేవ చేశారు. తండ్రి సహకారంతో ప్లేగు వ్యాధితో మరణించినవారెందరికో అంత్యక్రియలు జరిపించారు. ఇలా ఆమె వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ప్రముఖ న్యాయవాది పురుషోత్తమరావు కేల్కర్‌ను వివాహం ఆడి లక్ష్మీబాయిగా, శాంత వాత్సల్యాలకు తల్లిగా వార్థాలో అడుగుపెట్టారు. వార్థాలో బాలికలు చదువుకునేందుకు పాఠశాల లేదని గుర్తించిన లక్ష్మీబాయి ‘‘కేశరిమల్ కన్యా విద్యాలయం’’ స్థాపించి బాలికల విద్యకు బాటలు వేశారు. ఇదే తరుణంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో చేరిన తన కుమారుల్లో అలవడిన మానసిక క్రమశిక్షణ, యుద్ధకళల్లో నైపుణ్యాన్ని లక్ష్మీబాయి కేల్కర్ గమనించారు. ఇటువంటి శిక్షణే మహిళలకు సైతం అందించగలిగి సంస్థ ఉంటే వారిలో సైతం మార్పు సంభవిస్తుందని భావించారు. అంతే, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకులు పరమపూజనీయ సర్‌సంఘ్‌చాలక్ డా.హెడ్గేవార్‌ను కలుసుకొని తన ఆలోచనను ఆయన ముందుంచారు. డాక్టర్ జీ మార్గదర్శనంలో 1936 విజయదశమి రోజున వార్థాలో ఒక 5మంది సేవికలతో రాష్ట్ర సేవికాసమితిని ఏర్పాటు చేశారు. అటువంటి సేవికాసమితి ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మహిళా సంస్థగా రూపాంతరం చెంది 3 లక్షలకు పైగా సేవికలను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 855 కంటే ఎక్కువ సేవలను అందిస్తోంది.

రాష్ట్ర సేవికాసమితి ఆవిర్భావ సమయంలోనే ఇంచుమించు అదే లక్ష్యంతో పుణెలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సరస్వతీ తాయి కూడా తమ సేవా కార్యక్రమాలను ఆనందంగా సమితి ప్రవాహంలో సంగమింప చేశారు. అలా, లక్ష్మీ, సరస్వతుల దృఢ సంకల్పం, నిరంతర కృషి, కార్యదక్షత వల్ల అనతి కాలంలోనే సేవికా సమితి దేశమంతటా విస్తరించింది. మహిళల్లో సహజ ప్రతిభను పెంపొందించేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు, స్వల్పకాలిక కోర్సులతో గృహిణి విద్యాలయాన్ని వందనీయ మౌసీజీ స్థాపించారు. భారతీయ సంస్కృతి ఆధారంగా మహిళా విద్యను పునర్వ్యవస్థీకరించడానికి భారతీయ శ్రీవిద్యా నికేతన్ స్థాపించారు. భజన మండళ్లను ఏర్పాటు చేసి రాణి లక్ష్మీబాయి, జీజా మాత వంటి మహనీయుల విజయాలను కవితా రూపంలో గానం చేయించారు. హిందూ పదపాద షాహి శివాజీ మహారాజ్ పోరాటం, స్వామి వివేకానంద పిలుపు వంటి స్ఫూర్తిదాయక విషయాలపై ప్రదర్శనలు నిర్వహించి సామాజిక పునరుజ్జీవనానికి కృషి చేశారు. రాష్ట్ర సేవికా సమితి నిర్వహించే ప్రతి సమావేశంలో వందేమాతరం గీతాలాపానను తప్పనిసరి చేరి మాతృభూమి పట్ల దేశభక్తిని కలిగించేలా చర్యలు తీసుకున్నారు. కమలం, భగవద్గీత, కుంకుమ జెండా, అగ్ని కుండ్, గంట, కత్తి, పూసలు వరుసగా మహిళాశక్తిని సూచించే ఎనిమిది చేతులతో శక్తి దేవిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించి వివిధ కేంద్రాలలో విగ్రహాలను ప్రతిష్టింపజేశారు.

స్త్రీవాదం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే లక్ష్మీబాయి మహిళల అభ్యున్నతి మరియు అభివృద్ధి గురించి ఆలోచించారు. కుటుంబం మరియు సమాజంలో ప్రతి ఒక్కరినీ ఎలా ముందుకు తీసుకెళ్లాల్లో మహిళలకు నేర్పించారే తప్ప తమ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడమని మహిళలను ఏనాడు మౌసీజీ ప్రోత్సాహించలేదు. సమాజంలోని సభ్యులందరికీ సేవ చేసే దిశగా మహిళలు మాతృత్వ ప్రవృత్తిని పెంపొందించుకోవాలని నొక్కి చెప్పిన వందనీయ మౌసీజీ గుండెపోటుతో కార్తీక మార్గశిరం కృష్ణ పక్ష ద్వాదశి 2035 విక్రమ సంవత్ అంటే 27నవంబర్ 1978న తుది శ్వాస విడిచారు. నైతిక ధైర్యం, మానసిక దృఢత్వం, అసమానతలపై పోరాడి విజయం సాధించిన ధీర మహిళ యొక్క స్ఫూర్తిదాయకమైన కథే మౌసీజీ జీవితం. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా తన జీవన విధానం ద్వారా అనునిత్యం స్మృతి పథంలో ఉంటారు..స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటారు.