News

జనబాహుళ్యంలోకి మరిన్ని అన్నమయ్య కీర్తనలు

45views

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని.. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ పలు ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనలలో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు, ఎన్ని పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది..? తదితర అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను సంబంధిత అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈఓకు వివరించారు. వీటిపై సిబ్బందికి ఈఓ పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో జేఈఓ గౌతమి, హెచ్‌డీపీపీ ప్రోగ్రాం అధికారి రాజగోపాల్‌, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థ చార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.