ArticlesNews

మానవతా దర్శనం భగవద్గీత

75views

ధర్మక్షేత్రమయిన కురుక్షేత్ర యుద్ధ రంగంలో యోగీశ్వరేశ్వరుడు, కృష్ణపరమాత్మ జగదైక ధనుర్ధారి, ధర్మరాజు సోదరుడు అర్జునునకు కలిగిన అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసేందుకు ఉదయింప జేసిన జ్ఞానప్రభయేగీత. ఎక్కడో భారతదేశంలో కృష్ణుడు తన బావమరది అర్జునుడిని యుద్ధానికి పురిగొలుపుతూ చెప్పిన కొన్నిమాటలు విశ్వానికంతటికీ ఎందుకు వర్తిస్తాయి? అవి ఒట్టి వ్యక్తిగతమైన సంభాషణలు కదా!, వాటిని పట్టుకుని అందరూ వేళ్లాడవలసిన అవుసరమేముంది? ఈ వాదం నిజమేననిపిస్తుంది. కానీ మనకు అనిపించేవన్నీ నిజమేట్లా అవుతాయి?

కురుక్షేత్రం ఢిల్లీకి అల్లంత దూరంలోనున్న ఒక ప్రాంతము. దానికి వేదవ్యాసులు ధర్మక్షేత్రమని ఒక విశేషణం చెప్పారు. ఐతే అది ఒట్టి విశేషణం మాత్రమేనా? ఛందస్సు కుదరడానికో, అందంగా వినిపించడానికో వాడిన శబ్దమా? లోచూపు గల రుషి వ్యాసులు వారు మాటల అందానికి పాటుబడతారా? అఖిలద్రష్టయైన మహర్షి అన్నిటిలోనూ అందాన్ని చూడగలరు కనుక ఈ మాటే ఎందుకు వాడాలి? వారి హృదయంలో ఆ పద ప్రయోగానికి ఏదో మహత్తర ప్రయోజనానికి సంబంధించిన భావం ఉండి ఉంటుంది. ఈ ప్రయోగంలో హిందూ సంస్కృతి ఉచ్ఛశిఖరాన్ని అధిరోహించింది. గీతాశాస్త్రము విశ్వమానవులందరికీ శిరోధార్యమనే విషయం స్పష్టం చేసే ప్రయోగమిది. ఈ విషయం అవగాహన చేసుకునే ముందు అసలు మానవుడంటే ఏమిటి? అన్న విషయం ఆలోచిద్దాము.

ఆధునికులు మానవుడంటే ‘బుద్ధిగల జంతువు’ అని నిర్వచించారు. ప్రాణులలో ఆహార నిద్రాదులు సమానమైనా మానవునిలో ‘బుద్ధి’ (Rationality) భావన. ఆ బుద్ధి వలననే మానవుడు మిగిలిన పశుపక్ష్యాదులకన్న ఘనుడు కాగలిగినాడు అని వారి ఊహ. అంటే పశుత్వమూ బుద్ధిమత్వమూ కలిసి మానవత్వం ఏర్పడినది. అందువలననే నేటి మేధావి విశ్వమును క్షణంలో నాశనం చేయగలడు. తన బుద్ధి బలంతో పంచభూతాలతో ఊడిగం చేయించుకోగలడు. గోళాలతో బంతులాట ఆడగలడు. పశుపక్ష్యాదులకు ఈ పనులు చేతకావు.

ఐతే ఈ విషయం హిందూ మేధావులు, రుషులు, మహర్షులు కూడా ఆలోచించారు. బుద్ధిగల పశువే మానవుడు అని నిర్వచిద్దామంటే వాని అనుభవం ఆధునిక సాంఘిక శాస్త్రజ్ఞుల అనుభవానికి భిన్నంగా వుంది. హిరణ్యకశ్యపుడు, కంసుడు, రావణాసురుడు వంటి మహా మేధావులు వారికి దొరికారు. వీరంతా పంచభూతాలను కైవసం చేసుకున్నవారే. విశ్వవిజేతలే. వేదశాస్త్రాదులను అధ్యయనం చేసినవారే. తపోశక్తి, దైవభక్తికలవారే. కాని ఇన్ని ఉన్నా వారిని మానవులని పిలవడం వారికి అభిమతం కాకుండా పోయింది. రుషి బుద్ధికి, రావణాదులలో మానవుడు అనిపించుకోవడానికి కావలసినదేదో కనబడలేదు. అందుకే వారిని రాక్షసులన్నారు. లోకకంటకులు అన్నారు. ఈ స్థితిలో మానవుడంటే బుద్ధిగల పశువు (Man isa rational Animal.) అనే నిర్వచనం అసంగతం, తప్పుడు మాట అని తేలింది. బుద్ధివిషయంలో రావణాసురునికన్న బుద్ధిశాలి ఎవరున్నారు? ఐనా అతడు రాక్షసుడే…. మానవుడు కాడు.

రావణులో బుద్ధి ఉంది కాని ‘ధర్మం’లేదు. ‘పరాయి వాని భార్య నాకు తల్లితో సమానం’అనే ధర్మం వానికి తెలీదు. అందువల్లనే లోకకంటకుడయ్యాడు. కనుకనే రాక్షసుడని పేరుపడ్డాడు. ధర్మమూర్తి రాముడు, ధర్మరహితుడు, ధర్మానికి బాధను కలిగించేవాడు రావణుడిని సంహరించవలసి వచ్చినది. ధర్మానికి బాధ కలిగించడం అంటే లోకానికి బాధ కలిగించడమని అర్థం. లోకం ధర్మం అనే చట్టం వలన నడుస్తుంది. దాన్ని పాలించవలసిన బాధ్యత మానవునికి ఉంది. మిగిలిన పశుపక్ష్యాదులకు ఆ బాధ్యత లేదు. కనుకే వాటికి ధర్మం లేదు.