News

పాక్‌ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ

44views

ఎర్రకోటపై దాడి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ఉగ్రవాది మొహమ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అధికార వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. 2000 డిసెంబరు 22న ఎర్రకోట ఆవరణలోని 7 రాజ్‌పుతానా రైఫిల్స్‌ యూనిట్‌పై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు జవాన్లు మరణించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు లష్కరే తాయిబా ఉగ్రవాది ఆరి్‌ఫను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 1999లో మరో ముగ్గురు ఉగ్రవాదులు అబూ షాద్‌, అబూ బిలాల్‌, అబూ హైదర్‌లతో కలిసి ఆరిఫ్‌ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం అబూ షాద్‌, అబూ బిలాల్‌, అబూ హైదర్‌ వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. 2005 అక్టోబరు 5న విచారణ కోర్టు ఆరి్‌ఫకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా విచారణ కోర్టు తీర్పును సమర్థిస్తూ 2011 ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆరిఫ్‌ వేసిన రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. కాగా, ఈ ఏడాది మే 15న ఆరిఫ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని అదేనెల 27వ తేదీన రాష్ట్రపతి తిరస్కరించారు. మే 29న వెలువడిన రాష్ట్రపతి సెక్రటేరియట్‌ ఆదేశంలో ఈ మేరకు పేర్కొన్నట్టు అధికారులు బుధవారం వెల్లడించారు.