News

అంతర్జాతీయ సదస్సులో సత్తా చాటిన తెలుగు బాలిక

58views

అమెరికాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన తెలుగమ్మాయి సత్తా చాటింది. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (ఐఎస్‌డీసీ)లో పాల్గొని రాయగడ జిల్లాతోపాటు రాష్ట్ర కీర్తిని ఇనుమడింజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయగడలోని గాయత్రీనగర్‌కు చెందిన ఈశ్వర్‌ గోపాలచెట్టి, స్వాతి దంపతుల కుమార్తె తనిష్క. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో మే 23 నుంచి 26 వరకు జరిగిన ఐఎస్‌డీసీలో పాల్గొని ప్రసంగించింది. అంతరిక్షంలో మానవ ఆవాసానికి సంబంధించిన అంశంపై నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా ప్రసంగించి మన్ననలు అందుకుని ఉత్తమ ప్రాజెక్ట్‌ ప్రశంసాపత్రాన్ని గెలుచుకొంది. నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు సుశాన్‌ కిర్లాన్, డాక్టర్‌ ఫాసలే, ఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ మధుతవేలా తనిష్కను అభినందించారు.

గర్వంగా ఉంది..
ఈ విషయమై తనిష్క తల్లిదండ్రులు స్వాతి, ఈశ్వర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తమ అమ్మాయి అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రశంసలు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత రాయగడ జిల్లా, రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. తనిష్క మాట్లాడుతూ ఇంతటి విజయం వెనుక తనను ఎంతో ప్రోత్సహించిన తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని పేర్కొంది. భవిష్యత్తులో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికవ్వాలన్నది తన లక్ష్యమని వివరించింది.