News

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో తొలి మరణం.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో

59views

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడింది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో దవాఖానలో చేరిన 59 ఏండ్ల వ్యక్తి ఏప్రిల్ 24న మరణించారని పేర్కొంది. ఈ మేరకు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే అతడు పౌల్ట్రీ, జంతువుల వద్దకు వెళ్లినట్లు ఆధారాలు కూడా లేవని చెప్పింది.

కాగా, బాధితుడికి మొదటి నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారని, వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే అతడికి వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా తేలలేదని చెప్పింది. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తిని గుర్తించారని, అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. గత మే నెలలో మెక్సికోలోని మిచావ్‌కాన్‌ రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదైందని వెల్లడించింది.

మరోవైపు బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్‌ హెచ్‌5ఎన్‌1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధరించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు ఇంకా నిర్ధరణకాలేదు.