News

అయోధ్య ఫలితంపై ‘రామాయణ్’ నటుడు

73views

శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి ఓటమిపాలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ఈ ఫలితంపై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘ఈ ఎన్నికల ఫలితాలు (తీవ్రంగా నిరాశపర్చాయి. నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనా వారు ఆయనను తిరస్కరిస్తారు. అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది. ఆనాడు సీతాదేవినే వదల్లేదు. అలాంటిది.. ఇప్పుడు శ్రీరాముడిని టెంట్‌ నుంచి దివ్యమందిరంలోకి తీసుకొచ్చిన వారిని మోసం చేయకుండా ఎలా ఉంటారు? ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ దయతో చూడదు’’ అంటూ సునీల్‌ అసహనం వ్యక్తం చేశారు.