ArticlesNews

శ్రీవారి అభిషేకానికి పాలు సేకరించేది ఇక్కడే..! రోజుకు ఎన్ని లీటర్లు అవసరమంటే..!

87views

శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతాయి. ఈ కైంకర్యాల్లో కల్తీలేని స్వచ్ఛమైన పదార్థాలనే వినియోగిస్తారు. వీటన్నింటిల్లోకెల్లా ముఖ్యమైనవి గోవుపాలు. శ్రీవారి కైంకర్యాలలో స్వచ్ఛమైన గోవు పాలు వినియోగించాల్సిందే. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాలసంకర జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు., స్వామి వారి కైంకర్యాలు నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గో సంరక్షణ శాలను స్థాపించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గో సంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికీ నిత్య సేవలైన సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశవాళీ గో జాతులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. దేశంలో గల 14 రకాల గో జాతులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుంగనూరు, ఒంగోలు జాతులు, తమిళనాడుకు చెందిన ఉంబలాచారి, తాంగయ్యాన్, గుజరాత్ కు చెందిన గీర్, కాంక్రీజ్, పంజాబ్ కు చెందిన సాహీవాల్ జాతి, హర్యానాకు చెందిన, కర్ణాటకకు చెందిన హాలికర్, కేరళకి చెందిన వేచూర్ క్యాట్ జాతులతో పాటు మరికొన్ని విశేష జాతులు ఉన్నాయి.

స్వామి వారికీ వినియోగించే ప్రసాదాలు అన్ని శాస్త్ర బద్దంగా ఉండాలి. గోశాలలో ఉన్న దేశవాళి గోవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన పాలు సుప్రభాతం, తోమాల, ఏకాంత సేవల్లో నిర్వహిస్తారు. ఇక శుక్రవారం ఉదయం నిర్వహించే అభిషేక సేవకు 250 లీటర్ల పాలను తిరుపతి గోశాల నుంచి తిరుమలకు తీసుకెళ్తారు.