ArticlesNews

లేపాక్షి వర్ణ చిత్రం… మనో రంజితం

96views

అపురూప చిత్రాలు, శిల్పాలు చూసిన రసజ్ఞుడైన పర్యాటకుడి మనసు స్పందన నుంచి వచ్చిన మాటే… అద్భుతం. ఇంతటి అద్భుతానికి వేదికైంది ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతిగాంచింది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయం. చిత్రకారుని కుంచె నుంచి జాలువారిన వర్ణ చిత్రం…. శిల్పకారుడి ఉలి నుంచి ఉద్భవించిన అపురూప శిల్పం… వెరసి శిల్ప, చిత్రకళల కాణాచిగా లేపాక్షి విరాజిల్లుతోంది.

సొగసైన చిత్రాలు..
లేపాక్షి ఆలయం శిల్పాలకే కాదు… వర్ణ చిత్రాలకూ ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని నాట్యమంటపం పైకప్పులో వర్ణరంజితమైన చిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. రామాయణ, మహాభారత ఇతిహాసాలను సొగసుగా చిత్రీకరించారు. పుత్రకామెష్టి యాగ విధానాన్ని వివరిస్తున్న వశిష్టుడు, సీతా స్వయంవరం, సీతాపహరణ, రామ–రావణ యుద్దం, శ్రీరామ పట్టాభిషేకం, అర్జునుడి మత్స్యయంత్ర ఛేదనం, కిరాతార్జునీయ ఘట్టాలు, బ్రహ్మ, విష్ణు, నంది, భృంగి సమేతంగా శివుడు ప్రత్యక్షమవడం, వృషభ వాహనంపై శివపార్వతలు తదితర చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పార్వతీకి అలంకారం చేస్తున్న ఏడుగురు చెలికెత్తలు, వివిధ కేశాలంకరణలు కలిగిన సీ్త్రలు, గిరిజా కల్యాణంలో వధువు తలమీద పోస్తున్న తలంబ్రాల చిత్రాలు సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి. వటపత్రంపై పవళించిన చిన్నికృష్ణుడు తన కాలి బొటన వేలిని నోటిలో ఉంచుకుని మనం ఎటువైపు తిరిగి చూసినా మనవైపే చూస్తున్నట్టుగా చిత్రీకరించి చిత్రకారుడి నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతుంటారు.