News

సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మరోసారి వాయిదా

88views

బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. శనివారం ఈ ప్రయోగానికి రంగం సిద్ధంకాగా.. చివర్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి పయనం కావాల్సింది. ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను కంప్యూటర్‌ వ్యవస్థ నిలిపివేసింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం ఆదివారం జరిగే అవకాశం ఉంది. గత నెల 6న ఈ వ్యోమనౌక ప్రయోగానికి తొలి ప్రయత్నం జరిగింది. అయితే లీకేజీల సమస్య కారణంగా అది వాయిదా పడింది. యునైటెడ్‌ లాంఛ్‌ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్‌-5’ రాకెట్‌ ద్వారా స్టార్‌లైనర్‌ను నింగిలోకి పంపాల్సి ఉంది. నిజానికి ఈ యాత్ర ఎన్నో ఏళ్ల కిందట జరగాల్సింది. సాంకేతిక సమస్యల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను పంపడానికి స్పేస్‌ఎక్స్‌ సంస్థపైనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా ఆధారపడుతూ వస్తోంది. స్టార్‌లైనర్‌ కూడా సిద్ధమైతే.. రెండో వ్యోమనౌక అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.