News

మన గుడిలో పూజ.. ఢిల్లీ సంస్థ సేవ

154views

రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన ప్రధాన ఆలయాల్లో నిర్వహించే అన్ని రకాల వర్చువల్‌ పరోక్ష పూజలు, సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయించడానికి ఢిల్లీకి చెందిన సంస్థ అనుమతి ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.వాస్తవానికి అన్ని ప్రధాన ఆలయాలకూ సొంత వెబ్‌సైట్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఉంది. వీటి ద్వారా ఇప్పటికే వర్చువల్‌ సేవా టికెట్లను విక్రయిస్తున్నారు. ఇప్పుడు అదనంగా ఢిల్లీకి చెందిన సంస్థకు సైతం దేవాదాయశాఖ అవకాశం కల్పించింది. ఢిల్లీకి చెందిన ‘సర్వ్‌ దేవస్థానం-హిందూ ఛారిటబుల్‌ ట్రస్టు’కు సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు విక్రయించేందుకు దేవాదాయ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రూ. 500లోపు ఉండే వర్చువల్‌ సేవా టికెట్లపై రూ. 10, రూ. 500 నుంచి రూ. 1,000 మధ్య ఉండే టికెట్లపై రూ. 20, రూ. 1000కి పైన ఉండే టికెట్లపై రూ. 30 చొప్పున అదనంగా కమీషన్‌ తీసుకునేలా ఆదేశాల్లో పేర్కొన్నారు.

వివిధ ఆలయాల్లో సేవల టికెట్లు విక్రయించే అవకాశాన్ని తమకు కల్పించాలంటూ ఢిల్లీకి చెందిన సంస్థ మే 23న అర్జీ పెట్టుకుంది. దానిపై మే 24న అధికారులు సమీక్షించడం, 30న అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇలా అన్నీ వారం రోజుల్లో జరిగిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్చువల్‌ సేవా టికెట్లను నిత్యం భారీ సంఖ్యలో ఆ ఆలయ వెబ్‌సైట్‌ ద్వారానే జారీ చేస్తున్నారు. దేవాదాయశాఖ మాత్రం తమ పరిధిలోని ప్రధాన, ముఖ్య ఆలయాల్లో వర్చువల్‌ సేవా టికెట్ల విక్రయ బాధ్యతలను ఢిల్లీకి చెందిన సంస్థకూ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.

Source : ఈనాడు