ArticlesNews

తిరుమల లడ్డూ కన్నా అన్నమయ్య పాటే ఇష్టం

94views

నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో వైశాఖ పూర్ణిమనాడు కడప జిల్లా తాళ్లపాకలో జన్మించాడు అన్నమయ్య. ఎనిమిదేళ్లకే ఎవరికీ చెప్పకుండా తిరుమలకు బయల్దేరాడు. ఆ యాత్రలో ఆకలిగొన్న అన్నమయ్యకు అలమేలు మంగమ్మ వృద్ధురాలిగా కనిపించి పాయసం అందించింది. తిరుమల చేరి స్వామిని దర్శించుకున్నాక.. అలమేలు మంగమ్మను కీర్తిస్తూ ‘శ్రీవేంకటేశ్వర శతకం’ రచించాడు. ఆ మహాక్షేత్రంలోనే ఉంటూ.. స్వామిని దర్శించుకుంటూ కాలం గడపసాగాడు.

శ్రీవేంకటేశునిపై అపార భక్తి తగ్గలేదు. కనుకనే.. తిరుమల వెంకన్నను ‘స్వామీ! నీకు తిరుమల లడ్డూ కావాలా? అన్నమయ్య పాట కావాలా?’ అనడిగితే ఆ కోనేటిరాయడు రెండోదే కోరుకుంటాడు. ఆయన పాట స్వామికి అంత ఇష్టం మరి.

దక్షిణాదిన పదకవితాశైలి, భజన సంప్రదాయాలకు ఆద్యుడు అన్నమయ్య. తన జీవితకాలంలో వేలాది కీర్తనలు రచించాడు. అన్నమయ్య సంకీర్తనల ప్రవాహం సెలయేరులా ప్రవహించింది. తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న రాతి పలకల గదిలో సంకీర్తనల భాండాగారం బయటపడింది. అలా వేలాది అన్నమయ్య కీర్తనలు, మరెన్నో అమూల్య సంకీర్తనల సంపద అందుకోగలిగాం.

‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే..’ కీర్తనలో సమాజంలోని అసమానతలను చీల్చి చెండాడాడు అన్నమయ్య. ‘నిండార రాజు నిదురించే నిద్రయు ఒక్కటే..’ అంటూ రాజు, బంటులకు తేడా ఏముందని ప్రశ్నించాడు. ‘ఏనుగు మీద అయినా, శునకం మీద అయినా సూర్యకిరణాలు ఒకేరీతిలో పడతాయి’ అన్నాడు. ‘పంచభూతాలకు లేని ఈ పట్టింపులు నీకెందుకు?’- అంటూ ఆనాడే చురక పెట్టాడాయన. అన్నమయ్య పరమ భక్తుడే కాదు గొప్ప సంఘసంస్కర్త, ఆధ్యాత్మిక విప్లవ చైతన్యమూర్తి.