ArticlesNews

గీతావాక్యం

1.5kviews

గీత- కురుక్షేత్రం నడుమ, ఒక మహా సంగ్రామం ఆరంభ వేళ జరిగిన తాత్విక చర్చ, కురుక్షేత్రం, యుద్ధం ఇవి మన అంతర్గత సమరానికి ప్రతీకలంటారు. పండితోత్తములు. మనలోని యుద్ధ వాతావరణాన్ని గమనించాలి. మానసిక బలహీనతను ఓడించాలి. ఇందులో పాండవ మధ్యముడు ఆత్మ అయితే, కృష్ణ పరమాత్మ బ్రహ్మ. వారు అధిరోహించిన రథం మానవ దేహానికి ప్రతీక అంటారు. ఇది నరనారాయణుల మధ్య భావ వినిమయం. ఎంత గొప్ప భావన! శ్రోత నరుడు, అంటే అర్జునుడు. వ్యాఖ్యాత నారాయణుడు, ఆ దేవదేవుడు. భారతీయత మీద, విశ్వం మీద గీత జాడ ఎంత సుదీర్ఘమైనదో! గాఢమైనదో!

ఎంతమందిని నడిపించింది! అలనాటి శంకర భగవత్పాదులు మొదలు, రామానుజాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యుడు, చైతన్య మహాప్రభు, అభినవగుప్తుడు, జ్ఞానేశ్వరుని దాకా గీతాసారం గ్రోలినవారే. సమీపగతంలో బాలగంగాధర తిలక్, వివేకానంద, అరవిందులు, అనీబిసెంట్, వినోబా, గాంధీ, ఆల్డస్ హాక్సిలీ, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, కార్ల్ యాంగ్, హెర్మన్ హెస్సె వంటివారు ఎందరో జీవితాలపై గీతోపదేశం సుస్పష్టం. గీత ప్రతి యుగానికి కొత్త సందేశాన్ని ఇస్తుంది. మంచీ చెడుల మధ్య మనసులో జరిగే ఒక మహాయుద్ధానికి ప్రతీక కురుక్షేత్రమంటారు స్వామి వివేకానంద. మానవ జీవిత జ్ఞానసారం గురించి సహజ సౌందర్యంతో చేసిన గొప్ప వ్యక్తీకరణ గీత అన్నారు హెర్మెన్ హెస్సె.

‘సర్వశాస్త్ర మయీ గీత’ అంటుంది మహాభారతమే. మనిషి మానసికంగా స్థిరంగా ఉండేటట్టు చేసే శాస్త్రదృష్టి గీత బోధలలో ఒకటి అనిపిస్తుంది.స్మృతి భ్రష్టమైనందు వల్ల బుద్ధి, అంటే జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనం కావడం వల్ల మనిషి తన స్థితి నుంచి పతనమవుతాడు అంటుంది. బుద్ధి అంటే జ్ఞానశక్తి అనడంలోనే గీత లోతు తెలుస్తుంది.