ArticlesNews

హిందూ ధర్మ పరిరక్షకురాలు రాణి అహల్యాబాయి హోల్కర్

98views

( మే 31 – రాణి అహల్యాబాయి హోల్కర్ )

భారతదేశాన్ని పరిపాలించిన ఉత్తమ పాలకులలో రాణి అహల్యాబాయి ఒకరు. అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం మే 31న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని చౌండి గ్రామంలో జన్మించారు. తండ్రి మంకోజీ షిండే ఆ గ్రామానికి పటేల్. అహల్యా బాయికి 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్‌తో వివాహం జరిగింది. ఖండే రావు దురదృష్టవశాత్తు 1754వ సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటికి ఆమెకు నిండా 20 ఏళ్లు కూడా లేవు. నాటి పద్ధతి ప్రకారం సతీ సహగమనానికి పాల్పడబోయిన అహల్యా బాయిని మామ మల్హర్ రావ్ నిలువరించి ఆమెకు యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు.

అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి చేపట్టారు. అహల్యాబాయి గొప్ప దైవభక్తురాలు, ధార్మికురాలు. ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మింపజేశారు.సోమనాథ్‌లో పాడుబడి, అపవిత్రమైవున్న ప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.

అహల్యాబాయి శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిణి, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని ఆలయాలను పునరుద్ధరించారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు. అహల్వాబాయి భగవంతుని నామస్మరణచేస్తూ 1795 ఆగష్టు 13వ తేదీన కన్నుమూశారు. మంచి పరిపాలనాదక్షురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ఆలయ నిర్మాతగా, పరమభక్తురాలిగా, స్త్రీ శక్తిని దేశ నలుమూలలా చాటిన అహల్యాబాయి నేటి తరానికి ఎంతో ఆదర్శం.