News

శుక్ర, శని, ఆదివారాల్లో దుర్గమ్మ భక్తులకు ఉచిత బస్సు

70views

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి దేవస్థానం శుక్ర, శని, ఆదివారాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నది. దీంతో పాటు భక్తుల, వాహనాల రద్దీని పురస్కరించుకుని కొండపైకి ఆ మూడురోజుల్లో పరిమిత సంఖ్యలో వాహనాలను అనుమతించేందుకు నిర్ణయించారు. . కొండపైన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొండపైన ఓంటర్నింగ్‌ వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశంలో కేవలం 150 కార్లు, బైకులకు మాత్రమే స్థలం ఉండటంతో వాహనాలను దిగివన ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాలకు తరలించనున్నారు.

కొండపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన 12 బస్సుల్లో 8 బస్సులలో భక్తులను ఉచితంగా చేరవేయనున్నారు. దీనికోసం అధికారులు విజయవాడ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ప్రదేశం, పున్నమిఘాట్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. గవర్నరుపేట వైపు నుంచి వాహనాలను భక్తుల సౌకర్యార్థం కార్పొరేషన్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, కెనాల్‌ రోడ్డు పార్కింగ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ వైపు నుంచి కారుల్లో వచ్చే భక్తుల కోసం పున్నమిఘాట్‌ వద్ద వాహనాల పార్కింగ్‌కు చర్యలు చేపట్టారు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు పున్నమిఘాట్‌ వద్ద నుంచి రెండు బస్సులు, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి నాలుగు బస్సులు, వీఎంసీ ఎదురు పార్కింగ్‌ వద్ద నుంచి రెండు బస్సులు ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా శుక్ర, శని, ఆది వారాలలో దేవస్థానం సిబ్బందితో పాటు వన్‌టౌన్‌ పోలీస్‌ సిబ్బంది కూడా డ్యూటీలలో పాల్గొనున్నారు.