ArticlesNews

నేటి కాలానికి రామాయణ సందేశం

90views

వాల్మీకిగిరి సంభూతా రామసాగర గామినీ
శ్రీమద్రామాయణీ గంగా పునాతి భువనత్రయమ్॥

ఉత్తుంగ హిమగిరి శిఖరాలలో జన్మించి సాగరగామినియైన గంగ ముల్లోకాలను పావనం చేస్తుంది. జలరూపంతో ప్రవహించే ఆ గంగయే వాగ్రూపంతో వాల్మీకిగిరి నుండి అవతరించింది. అదియే రామాయణిగంగ, ఇది జలరూపిణియైన గంగ కంటే విశిష్టమైనది. ఆ గంగను చేరి దర్శన స్పర్శనాదుల ద్వారా ఆరాధించి తరించుతారు. ఈ రామాయణీ గంగ వ్యాపించని తావులేదు. ఎక్కడి నుంచి అయినా, ఎట్టి స్థితిలోనైనా ఈ రామాయణ కావ్య గంగను శ్రవణం, మననం, ఆరాధనలతోతరించవచ్చు.

ఈ కలికాలంలో ఈ మహాకావ్యం అందించే శుభసందేశం ఏమిటో పరిశీలించటం ఎంతైనా అవసరం. కావ్యం సాధారణంగా కొన్ని విషయాలను సూటిగా చెప్పుతూ పోతూ వుంటుంది. కొన్నిటిని కాంతా సమ్మితంగా వ్యంగ్య మర్యాదతో సూచిస్తూ ఉంటుంది. వీటన్నిటి ద్వారా కావ్య తాత్పర్య ప్రధానంగా దర్శించవలసి ఉంటుంది. ఆయా ప్రకరణాలలో చెప్పిన సందేశాలు ప్రధాన సందేశానికి దోహదం చేస్తూ ఉంటాయి. క్రమశిక్షణలేక దుర్బల చంచల చిత్తులై పరస్పర విద్వేషాలతో స్వార్థచింతనలతో అశాంతితో మగ్గుతూ ఉండే ప్రజలకు రామాయణమిచ్చే దివ్యసందేశం సంజీవని వంటిది.

చిత్తశుద్ధి – విజ్ఞాన సంపద
రామాయణ మహాకావ్యం ‘తపఃస్వాధ్యాయ’ శబ్దాలతో ప్రారంభమయింది. ప్రజల సుఖజీవనానికి ‘తపఃస్వాధ్యాయములు’ మూలబీజములనే విషయాన్ని ఈ కావ్యారంభం సూచింపచేస్తోంది. తపశ్శక్తికి స్వాధ్యాయం కూడా తోడైతే విజ్ఞాన సౌరభాలతో చిత్తం తేజరిల్లుతుంది. స్వాధ్యాయమంటే ఉత్తమ విద్యాసంవత్తి. శకటానికి రెండు చక్రాలవలె, ఆకాశంలో ఎగిరే పక్షికి రెండు రెక్కలలాగా సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి-విజ్ఞాన సంపద (తపఃస్వాధ్యాయములు) రెండూ అవసరమే.