News

నిత్యం వేద పఠనంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం

97views

నిత్యం వేద పఠనం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందని ప్రముఖ వేద పండితుడు గుళ్ళపల్లి సీతారామ శ్రీహర్ష ఘనాపాఠి అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలంలోని గంగలకుర్రులో శ్రీ గోదావరి మండల వేదశాస్త్ర ప్రవర్ధక సభ చారిటబుల్‌ ట్రస్ట్‌ 73వ వార్షికోత్సవం జయంతి భాస్కర సుబ్రహ్మణ్యం స్వగృహంలో రెండవ రోజు జరిగింది. ఈ సందర్భంగా వేదపఠనంతో గ్రామపదక్షిణ గావించారు. ఇలాచేయడం వల్ల లోకహితం కలుగుతుందని శ్రీ హర్ష ఘనాపాఠి అన్నారు. అనంతరం పరీక్షల నిర్వహణాధికారి, ట్రస్టు సహాయ కార్యదర్శి భమిడిపాటి యజ్ఞేస్వర ప్రసాద్‌ పర్యవేక్షణలో వేద, శాస్త్ర, శ్రౌత, స్మార్త, అపర, ఆగమ విద్యలలో పరీక్షలు నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ తాము వేద విద్యలో తగిన పట్టా పొందేందుకు వచ్చినట్లు తెలిపారు.పరీక్షా అధికారులుగా కడియాల సీతారామ అవధాని ఘనాపాఠీ, గుళ్ళపల్లి సీతారామ శ్రీహర్ష ఘనాపాఠి, కర్రా సోమసుందర శర్మ వ్యవహరించారు.

పిల్లల ఆసక్తిని గమనించాం
వేద పరీక్షలకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వేద విద్యార్థులు తమ తల్లులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు మాట్లాడుతూ చిన్నతనం నుంచే తమ పిల్లలకు వేదవిద్యపై ఉండే ఆసక్తిని గమనించామన్నారు. సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన నేపథ్యంలో ఉపనయనాది సంస్కారాలు చిన్నతనంలోనే నిర్వహించామని అనంతరం అన్నవరంలో ఉండే స్మార్త ఆగమ పాఠశాలకు పంపామన్నారు. భమిడిపాటి సుబ్రహ్మణ్య సోమయాజులు, తేజోమూర్తుల ఉదయ సాయి ప్రద్యుమ్న తల్లులు మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి వేద పండితులుగా తమ పిల్లలు రాణించాలన్నదే తమ అభిమతమన్నారు.