News

కాంగ్రెస్ నేత చైనా ప్రేమ : 1962లోది యుద్ధం కాదట, చొరబాటు మాత్రమేనట

106views

కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చైనాపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. 1962లో ఆ దేశం భారత్‌పై చేసింది యుద్ధం కాదట. చైనా భారత్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు మాత్రం వచ్చాయట. అంటే మణిశంకర్ అయ్యర్ మాటల ప్రకారం చూస్తే పాపం చైనా మనదేశంతో యుద్ధం చేసిందని, మన సైనికులు వారిని నిలువరించే ప్రయత్నం చేసారనీ, ఆ సమయంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందనీ చెప్పేవన్నీ అబద్ధాలన్నమాట.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు వచ్చాయి’’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆయన తర్వాత క్షమాపణలు చెప్పారు. ‘చైనీయుల చొరబాటు’ అన్న పదానికి ముందు ‘ఆరోపణలు’ అన్న పదం వాడడం తాను చేసిన తప్పు అని, దానికి క్షమాపణలు చెబుతున్నాననీ అయ్యర్ వెల్లడించారు.

‘‘ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అవకాశాన్ని నెహ్రూ చైనా కోసం వదిలిపెట్టేసారు. రాహుల్ గాంధీ చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నారు.దానివల్ల దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. ఇంక ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ 1962లో చైనా అసలు భారత్‌పై యుద్ధమే చేయలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ యుద్ధం సమయంలోనే చైనా మన దేశానికి చెందిన 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అన్యాయంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించింది’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.