ArticlesNews

భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం

114views

మైత్రేయి. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన తల్లి మైత్రేయి. బృహదారణ్య కోపనిషత్తులో ఆత్మ, పరబ్రహ్మ అనుసంధానం గురించి, అద్వైతం గురించి మాట్లాడేది.

వేదకాలంలోని గొప్ప పండితురాళ్ళలో ఒకరు గార్గి. జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షులను అధిగమించింది. ఆమె వాచక్ను మహర్షి కుమార్తె. ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసింది. జనక మహారాజు ఓసారి పండితుల సభ ఏర్పాటు చేశాడు. దేశం నలువైఫుల నుండి వచ్చిన ఋషిపుంగవులతో సహా యాజ్ఞవల్క్యుడు, గార్గి కూడా వచ్చారు. గార్గి కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. వాటికి కూడా యాజ్ఞవల్క్యుడు సమాధానాలిచ్చాడు. ఆ సభలో పాల్గొన్న ఏకైక మహిళ, ఋషిక, గార్గి. గార్గి పేరు ఉపనిషత్తులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

1500-500 బి.సి. కాలంలో ఎందరో మహిళలు వేదాలను చదివారు. అందులో గార్గి ఒకరు. క్రీ.పూ. 700 లో జన్మించింది. గార్గి పేరున గోత్రం కూడా వుంది. గార్గి అంటే ఆలోచింపచేసేది అని అర్థం. ఢల్లీిలో గార్గి పేరున ఒక కళాశాల ఉంది. ఆ కళాశాల 2016లో స్వర్ణోత్సవం జరుపుకుంది. గార్గి ఋషిక, మహిళలకు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం గురించి ప్రబోధించేది. ఆమెను ఋషి పరంపరలోని నవరత్నాలలో ఒకరుగా భావిస్తారు. వేదాలను అభ్యసించేందుకు ఉపనయనం చేసుకుంది. యాజ్ఞవల్క్యుడికి పరబ్రహ్మ గురించి ఆమె అనేక ప్రశ్నలను సంధించింది. పరబ్రహ్మ గురించి ఎక్కువగా ప్రశ్నించవద్దని యాజ్ఞవల్క్యుడు వారిస్తాడు.