News

దుర్గగుడి ఆలయ శిఖరానికి స్వర్ణతాపడ పనులు వేగవంతం‌…

83views

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రధాన ఆలయ శిఖరంలోని సగభాగానికి స్వర్ణతాపడం పనులు వేగవంతం చేశారు. ఎప్పటి మాదిరే స్వర్ణతాపడం పనులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అప్పగించారు. ఆలయ పైభాగం స్వర్ణతాపడాన్ని గతంలో టీటీడీనే నిర్వహించింది. దీనికి తగిన బంగారాన్ని, సంబంధిత పనులకుగాను స్వర్ణతాపడ నిపుణులకు మజూరీ తదితరాలను దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానమే భరిస్తుంది. స్వర్ణతాపడం నిమిత్తం దాతల నుంచి దేవస్థానం విరాళాలు స్వీకరిస్తున్నది. కనకదుర్గ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ పేరిట విరాళాల సేకరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీన డోనర్‌ సెల్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు భక్తుల నుంచి సుమారు రూ.25 లక్షలకు పైగా విరాళాలు సమకూరాయి. స్వర్ణతాపడానికి సుమారు 75 కేజీల బంగారం అవసరమని అంచనా వేశారు. భక్తుల విరాళాలతో పాటు దేవస్థానం వద్ద ఉన్న బంగరాన్ని కూడా టీటీడీకి అప్పగించి స్వర్ణతాపడం పనులను పూర్తి చేయించేందుకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు.