News

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

51views

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.