News

ఎట్టి పరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక

71views

భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

చైనాకు చెందిన ఓ గూఢచార నౌక గత ఏడాది శ్రీలంక హంబన్‌టోట నౌకాశ్రయంలో కొన్ని రోజుల పాటు ఆగింది. దానికి పొరుగు దేశాల నావికాదళ కార్యకలాపాలపై నిఘా వేసే సామర్థ్యం ఉన్నట్లు భారత్‌ గుర్తించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ భద్రతకు హాని కలిగించే ఏ విషయంలోనైనా తాము జోక్యం చేసుకుంటామని ఇరు దేశాలకు భారత్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే, తాము ఇతర దేశాలతో చాలా పారదర్శకంగా పనిచేస్తామని.. పొరుగు వారికి నష్టం కలిగించే చర్యలకు ఏమాత్రం ఆమోదం తెలపబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్‌ ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగానే.. తమ విధానం కూడా ఉంటుందని వివరించారు. కానీ, ఇతరులకు హాని తలపెట్టే నిర్ణయాలను మాత్రం తీసుకోబోమని పేర్కొన్నారు.