ArticlesNews

స్వరాజ్య ఉద్యమ ప్రకాశం

113views

(మే 20 – టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి)

కొదమసింహంలా స్వాతంత్య్రం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశంపంతులు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకూ దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. మద్రాసులో సైమన్ కమీషన్‌ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్నుచూపించి వెళ్లిపోయారు. అందుకే ప్రకాశంను ‘ఆంధ్రకేసరి’ అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు.

గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగస్ట్ 1872న ప్రకాశం పంతులు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో అంతటి గెలుపు తీరాలు చేరాడు. రాజాజీ మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను అధికార పీఠాన్ని అధిరోహించారు. ముక్కుసూటి మనిషి. నిజాయితీపరుడు.

ప్రకాశం ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదు. ఏది సామాన్య ప్రజాహితమో దాని వైపే నిల్చొనేవారు. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశంనే ఎంచుకున్నారు. ఆయన పాలనా కాలం స్వల్పమే అయినప్పటికీ, సంక్షేమాలకు, సంస్కరణలకు పెద్దపీట వేశారు. వేంకటేశ్వర విద్యాలయం స్థాపన, నీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. విజయవాడలో కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణం ఆయన ఘనతే. అందుకే దానికి ప్రకాశం బ్యారేజి అని పేరు పెట్టారు.

టంగుటూరి ప్రకాశం పంతులు 1957 మే 20వ తేదీన దివంగతులైనారు.