News

చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం

57views

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు మంగళస్నానాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు మల్లేశ్వర శాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్‌, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో గంగ, పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆది దంపతులను నూతన వధూవరులుగా అలంకరించారు. సాయంత్రం మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన వంటి వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ఈఓ కె.ఎస్‌.రామరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పెళ్లి కుమార్తెగా దుర్గమ్మ
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని పెళ్లికుమార్తెగా అలంకరించారు. ఆది దంపతులకు మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ అనంతరం మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించిన పిమ్మట పెళ్లికుమార్తెగా నుదిటన బాసికం, కల్యాణ తిలకం, బుగ్గన చుక్కను ఆలయ అర్చకులు అలంకరించారు.

వెండి పల్లకీపై ఆదిదంపతులు
చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజు దుర్గామల్లేశ్వర స్వామి వార్లను వెండి పల్లకీపై ప్రతిష్టించి నగరోత్సవాన్ని నిర్వహించారు. మహా మండపం దిగువన వెండి పల్లకీపై ఆశీనులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ ఈఓ రామరావు పూజలు నిర్వహించిన నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తజనుల కోలాట నృత్యాలతో నగరోత్సవం ముందుకు సాగింది.

సకల దేవతలకు ఆహ్వానం
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సకల దేవతలకు ఈ బ్రహ్మోత్సవాల ఆహ్వానం పలుకుతూ గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. పూజల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.