
కాశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే. పాకిస్థాన్ మాత్రం ఏమేమో చెబుతూ భారత్ ను చెడ్డగా చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశాడు. కాశ్మీర్ వివాదం గురించి ట్రంప్ కు ఇమ్రాన్ ఖాన్ ఏమి చెప్పాడో ఏమో కానీ అవసరం అనుకుంటే కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడట. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం రెండు దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం నెరపాల్సిందిగా తనను కోరారని డొనాల్డ్ ట్రంప్ ఇమ్రాన్‌తో అన్నారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా ఊదరగొడుతోంది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ట్రంప్-ఇమ్రాన్ సమావేశంపై వైట్‌హౌస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన లేదు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించమని మోడీ కూడా అడిగారన్న ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్ వివాదాన్ని అంతర్గత సమస్యగానే భావిస్తామని, ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు భారత్ ను ఇరుకునపెట్టాలని చూశారు. కానీ భారత్ ధీటుగానే బదులిస్తోంది.
భారత్ ఘాటుగా స్పందించటంతో అమెరికా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. వైట్ హౌస్ భారత్ కు మద్దతునిస్తూ ప్రకటనను విడుదల చేసింది. భారత్-పాక్ లు కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు ట్రంప్ ప్రభుత్వం సహకరిస్తుందని మాత్రమే అమెరికా స్పష్టం చేసింది.
కాశ్మీర్ అంశం ఇండియా, పాకిస్థాన్ లకు చెందినదని, ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటేనే భారత్ తో ద్వైపాక్షిక చర్చలు విజయవంతమవుతాయని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చిత్తశుద్ధిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పాక్ కు అక్షింతలు వేశారు.
Source : Bharath Today.
 
			




