NewsSeva

బాల బాలికలలో సంస్కారము, దేశభక్తి నింపాలి – ఆరెస్సెస్ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

147views

నెల్లూరు నగరంలోని కైలాస పురం (బోడిగాడితోట), వైకుంఠపురం (మైపాడు రోడ్), రాయప్ప పాళెం (సరస్వతి నగర్), 3వ మైలు, దీనదయాళ్ నగర్ (దెయ్యాల దిబ్బ) ఈ ఐదు కేంద్రాలలో గత దశాబ్ద కాలంగా సేవాభారతి అభ్యాసిక(ఉచిత ట్యూషన్ సెంటర్)లు నిర్వహిస్తోంది. వీటిలో 1 నుంచి 9 వరకు చదివే బాలబాలికలు షుమారు 20 నుంచి 30 మంది ఒక్కొక్క అభ్యాసికలో ఉచితం శిక్షణ పొందుతున్నారు. రోజూ రెండు గంటల పాటు నడిచే ఈ అభ్యాసికలలో పిల్లలకు వారి పాఠ్యాంశాలతోపాటు చిన్న చిన్న కథలు, దేశభక్తి గేయాలు, పద్యాలు, శ్లోకాలు, ఆటలు, వ్యాయామం వంటివి కూడా నేర్పుతారు. చక్కటి ఆటపాటల మధ్య విద్య ఉచితంగా లభిస్తుండడంతో బాలబాలికలు ఈ అభ్యాసికలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అభ్యాసికలకు పంపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అభ్యాసికలకు వెళ్ళడం వల్ల తమ పిల్లలకు సంస్కారం అలవడుతోందని, వారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనబడుతోందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇలాంటి అభ్యాసికలలో ఒకటైన కైలాస పురం అభ్యాసికను ఆరెస్సెస్ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్ సందర్శించారు. పిల్లలు శ్లోకాలు, పద్యాలు, పాటలు ముక్త కంఠంతో రాగయుక్తంగా చెప్పడాన్ని ఆసక్తిగా తిలకించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యతోపాటు పిల్లలలో క్రమశిక్షణను, దేశభక్తిని నింపాలని, సేవాభారతి నిర్వహిస్తున్న అభ్యాసికల ద్వారా పిల్లలకు దేశభక్తి, క్రమశిక్షణ, శుభ్రత వంటి గుణాలు అలవడుతాయని అన్నారు.  పిల్లలు పాఠాలతోపాటు వీరుల, మహానుభావుల జీవిత ఘట్టాలను చిన్న చిన్న కథల రూపంలో తెలుసుకోవడం, పద్యాలు, శ్లోకాలు వంటివి నేర్చుకోవటం ద్వారా వారికి ఉత్తమ గుణాలు అలవడుతాయని, ఆ పని సేవాభారతి నిర్వహిస్తున్న అభ్యాసికల ద్వారా సాకారమవుతోందని అన్నారు.

ఈ సందర్భంగా ఆరెస్సెస్ నెల్లూరు విభాగ్ సేవా ప్రముఖ్, నెల్లూరు జిల్లా సేవా ప్రముఖ్, నెల్లూరు నగర సేవా ప్రముఖ్ లు కూడా శ్రీ అభ్యంకర్ తోపాటు ఉండి వారికి అన్ని విషయాలు వివరించారు.