News

కుల్ భూషణ్ కేసులో భారత్ విజయం

697views

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఘ‌న‌ విజయం ల‌భించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో భారత్‌కు అనుకూలంగా 15 మంది జడ్జీల తీర్పు ఇవ్వగా.. ప్రతికూలంగా ఒక జడ్జి తీర్పు ఇచ్చారు.

ఆ  న్యాయవాది ఫీజు ఒక్క రూపాయి : 

అంతర్జాతీయ వేదికపై భారత్‌ గెలుపులో ఆ కేసును వాదించిన భారత న్యాయవాది హరీష్‌ సాల్వే కృషి వర్ణించలేనిది. అయితే.. భారత్‌ తరఫున వాదనలు వినిపించిన హరీష్‌ సాల్వే.. పాక్‌ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. అంతేకాదు కులభూషన్‌ జాదవ్‌ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలిగారు.

ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుష్మాస్వరాజ్‌ ట్విట్‌లో వెల్లడించారు. దీనిపై ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ఇప్పటికే సుష్మాస్వరాజ్ కూడా ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

న్యాయాన్ని ప్రతిబింబించే తీర్పు – ప్రధాని మోడీ :

ఈ తీర్పుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయాన్ని ప్రతిబింబించేలా ఈ తీర్పు ఉందని అన్నారు. కుల్ భూషణ్ జాదవ్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడి సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వాస్తవాలను పరిశీలించి, సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.

భారత్ కు గొప్ప విజయం – సుష్మా స్వరాజ్:

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఐసీజే తీర్పుపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ భారత్‌కు ఇది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. జాదవ్‌ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.