
నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక సమస్యల ఏర్పడటంతో ప్రయోగం వాయిదా పడింది. దీంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్‌డౌన్ కొనసాగగా, ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల 24 సెకన్లు ఉండగా సాంకేతిక లోపాలతో కౌంట్‌డౌన్ నిలిచిపోయింది. క్రయోజనిక్ స్టేజ్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల ప్రయోగాన్ని నిలిపివేసినట్లు, తదుపరి ప్రయోగ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో అధికారప్రతినిధి గురుప్రసాద్ ప్రకటించారు.
చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. నేడు మరింత సమాచారం కోసమే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్‌లను పంపాయి.