News

13 నుంచి విజయకీలాద్రి వార్షికోత్సవాలు

194views

గుంటూరు జిల్లా తాడేపల్లి కొండపై విజయకీలాద్రి దివ్యక్షేత్రం 7వ వార్షికోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు అహోబిల చినజీయర్‌ స్వామి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో కార్యక్రమ కరపత్రాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ ఉత్సవాలు 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. 14వ తేదీ అగ్నిప్రతిష్ఠ, పల్లకి సేవ, 15, 16, 17వ తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కల్పవృక్ష వాహనసేవ, సుదర్శన హోమం, చంద్రప్రభ వాహన సేవ, గజవాహన సేవ, ఆదిత్య హృదయ పారాయణ, సూర్యప్రభ వాహన సేవ, విజయకీలాద్రి గిరిప్రదక్షిణ, విశేష వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 18వ తేదీ పుష్పయాగం, చక్రతీర్థం, పూర్ణాహుతి, వేదాశీర్వచనంతో కార్యక్రమాలు ముగుస్తాయని వివరించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సమావేశంలో వెంకటాద్రి, చందన మధు తదితరులు పాల్గొన్నారు.