ArticlesNews

నింగిలోకి దూసుకెళ్ల‌నున్న చంద్ర‌యాన్ 2…సెప్టెంబ‌ర్ 6న చంద్రునికి 30కి,మీ ఎత్తులో…

674views

భార‌త కీర్తిప‌తాకాన్ని న‌లుదిశ‌లా వ్యాప్తి చేస్తూ… ప్ర‌పంచ దేశాల ఎదుట స‌గ‌ర్వంగా నిలుస్తున్న ఇస్రో కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టింది. ఇక ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రముఖ పాత్ర పోషించనుంది. ఎస్ఎల్వీ రాకెట్లతో 40 కేజీల బరువు గల ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో ప్రస్తుతం 4 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. ఇటీవల జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు శాస్త్రవేత్తలు. బాహుబలి రాకెట్గా పిలుచుకునే ఈ రాకెట్ ద్వారా ఇప్పటికే మూడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ప్రస్తుతం 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ జాబిల్లి దగ్గరకు తీసుకెళ్లనుంది.

రూ.978 ఖ‌ర్చుతో…
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన చంద్రయాన్ 2 కోసం ఇస్రో ఇప్పటివరకు 978 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ మార్క్ -3 అనే 640 టన్నుల బరువుగల రాకెట్ ను రూపొందించారు. ఇక చంద్రయాన్ 2ను ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు భాగాలుగా విభజించారు. జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2ను ప్రయోగించనున్నారు. మొత్తం 3 లక్షల 50 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. సెప్టెంబ‌ర్ 6న చంద్రునికి 30 కిలోమీట‌ర్ల దూరం ఎత్తులో ఈ ఉప‌గ్ర‌హం ల్యాండ్ కానుంది. అధిక బరువు కలిగిన ఉపగ్రహాలను నింగిలోకి పంపించాలంటే విదేశాలపై ఇస్రో ఆధారపడాల్సి వచ్చేది. అయితే స్వదేశీ పరిజ్ణానంతో రూపొందించిన ఈ రాకెట్ ప్రస్తుతం అన్ని దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే గగన్ యాన్ అనే మరో అత్యంత అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు శాస్త్రవేత్తలు.

చంద్రుని చుట్టూ ప‌రిభ్ర‌మిస్తూ నాణ్య‌మైన ఫోటోలు:
చంద్రయాన్ 2… చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలను ఇస్రోకు పంపనుంది. ఇప్పటికే చంద్రయాన్ 1 ద్వారా నీటి అవశేషాలను కనుక్కున్న ఇస్రో.. చంద్రయాన్ 2 ద్వారా మరిన్ని పరిశోధనలు చేసి జాబిలి స్థితిగతులను ప్రపంచదేశాల ముందు ఆవిష్కరించబోతోంది. చంద్రయాన్ 2లో పంపే పేలోడ్స్ కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ పేలోడ్స్ చంద్రుడిపై ఉపరితలం, నీరు, వాతావరణం, త్రీడీ చిత్రాలు తీసి పంపేలా రూపొందిస్తున్నారు.

ప్ర‌యోగాన్ని వీక్షించేందుకు 10వేల మందికి అవ‌కాశం:
ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగం కోసం ఇస్రో నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటికే షార్లో జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ అనుసంధాన పనులు పూర్తయ్యాయి. ఇక రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, గవర్నర్ తో పాటు ఏపీ సీఎం జగన్ కూడా షార్ కు చేరుకోనున్నారు. అదే విధంగా ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మందికి అవకాశం కల్పించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. చంద్రయాన్ 1 ద్వారా చంద్రునిపై నీటి జాడలు కనుక్కున్న ఇస్రో… చంద్రయాన్ 2 ద్వారా ఎలాంటి పరిశోధనలు జరపుతుందా అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.

Source : Bharath Today

http://www.bhaarattoday.com/posts/view/isro-set-to-launch-chandrayaan-2-moon-mission/3854