
విజయవాడ సమీపంలోని నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారకుల సమావేశాలు జరిగాయి. ఈ నెల 11, 12, 13 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కిలోని విజ్ఞాన విహార రెసిడెన్షియల్ పాఠశాల నందు జరిగిన ఈ సమావేశాలలో సంఘ పరంగా దేశం మొత్తంలో ఉన్న 44 ప్రాంతాల నుంచి ప్రాంత ప్రచారక్ లు, సహ ప్రాంత ప్రచారక్ లు, క్షేత్ర ప్రచారకుల తోపాటు అఖిల భారతీయ కార్యకారిణి కూడా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. వీరితోపాటుగా కొందరు వివిధ క్షేత్ర సంఘటనా మంత్రులతో కలిపి మొత్తం షుమారు 200 మంది ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చివరి రోజైన 13/7/19 శనివారం నాడు నూతక్కిలోని మాతృఛాయ వసతి గృహంలోని ఆడిటోరియంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆరెస్సెస్ అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య ప్రాంత ప్రచారక్ ల వర్గలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు.
ఇలాంటి సమావేశాలు ప్రతి ఏడాది జూలైలో జరుగుతాయని, గత సంవత్సరం సోమనాథ్ లో జరిగాయని, ఇవి నిర్ణయాలు తీసుకునే సమావేశాలు కాదు. ఇందులో ఎలాంటి తీర్మానాలు చెయ్యబడవని అఖిల భారతీయ సహా సర్ కార్యవాహ శ్రీ మన్మోహన్ వైద్య తెలిపారు. ఈ సమావేశాలలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రాంత ప్రచారక్ లు, క్షేత్ర ప్రచారక్ లు, వివిధ క్షేత్రాల సంఘటనా మంత్రులు పాల్గొన్నారని వారు తెలిపారు.
ఈ ఏడాది దేశం మొత్తం మీద 84 వేసవి శిక్షణా తరగతులు (సంఘ శిక్షావర్గలు) జరిగాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల మధ్యలో దేశ వ్యాప్తంగా 54 ప్రదేశాలలో జరిగిన ప్రథమ వర్ష సంఘ శిక్షావర్గలలో 12456 మంది శిక్షణ పొందారని, దేశ వ్యాప్తంగా 14 ప్రదేశాలలో జరిగిన ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గలలో 1940 మంది శిక్షార్ధులు పాల్గొన్నారన్నారు. ఇక నాగపూర్లో జరిగే తృతీయవర్ష సంఘశిక్షావర్గలో దేశం మొత్తం మీద నుంచి 821 మంది పాల్గొన్నారని తెలిపారు. వీరంతా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారేనని, 40 పైబడిన వారికి జరిగిన శిక్షావర్గలలో దేశ వ్యాప్తంగా మరో 2289 మంది పాల్గొన్నారని వెల్లడించారు.
సంఘ శిక్షావర్గలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో శిక్షార్ధులు కేవలం బక్కెట్ నీటితో స్నానం, బట్టలు ఉతుక్కోవడం పూర్తి చేసేట్లు ప్రయత్నించడం, పాత్రలు కడిగే అవసరం లేకుండా చేతిలో రోటి, అందులోనే కూర వడ్డించడం వంటి చర్యల ద్వారా రోజుకి 5000 లీటర్ల నీటిని ఆదా చేయగలిగామన్నారు.
ప్రస్తుతం దేశం మొత్తంలో 33247 స్థలాల్లో 53182 శాఖలు జరుగుతున్నాయని, 10577 స్థానాలలో 15620 సాప్తాహిక్ లు, 7152 సంఘమండలిలు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తానికి గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 400 స్థానాల్లో 600 శాఖలు పెరిగాయన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 50900 గ్రామాలలో సంఘకార్యం కొనసాగుతోందన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా సంఘం ప్రచురించే జాగరణ పత్రికలు దేశంలో 175000 గ్రామాలకు వెళుతున్నాయన్నారు. క్రొత్తగా సంఘం పరిచయమైనవారికి 7 రోజుల పాటు నిర్వహించే ప్రాథమిక శిక్షావర్గలలో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఒక లక్షమంది యువకులు శిక్షణ పొందారని తెలియజేశారు.
సంఘ దైనందిన కార్యక్రమాలలో భాగస్వాములు కావాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, సంఘం నిర్వహించే “జాయిన్ ఆరెస్సెస్” ద్వారా ఆరెస్సెస్ లో చేరడానికి 2014 జనవరి, జూన్ మధ్య కాలంలో 39716 అభ్యర్ధనలు రాగా 2016లో 47200 అభ్యర్ధనలు అందాయని, ఆ సంఖ్య గత సంవత్సరం 56892 కి పెరగ్గా ఈ ఏడాది గడచిన ఆరు నెలల్లోనే 66855 అభ్యర్ధనలు అందాయని తెలిపారు. వారందరూ 20 నుంచి 35 ఏండ్ల వయసు వారేనని వారిలో మన సంస్కృతిని తెలుసుకుని ప్రేరణ పొందడం కోసం సంఘానికి చేరువవుతున్న వారు 50 శాతం మంది కాగా, సమాజానికి మరింతగా ఉపయోగపడాలంటే సంఘమే సరియైన వేదిక అని భావిస్తున్నవారు 30 శాతం మంది ఉండడం గమనార్హమన్నారు.
సహజంగా సంఘం ఏ విధమైన రాజకీయ కార్యకలాపాలలో నేరుగా పాలు పంచుకోదని, అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప.పూ సర్ సంఘచాలక్ వంద శాతం ఓటింగ్ నమోదు చెయ్యవలసినదిగా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భంలో ఆ పిలుపుకనుగుణంగా స్వయంసేవకులు రాజకీయాలకు అతీతంగా ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళారన్నారు. ఆ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఓటింగ్ శాతం నమోదయిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ జనజాగరణ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఐదున్నర లక్షల గ్రామాల్లో షుమారు నాలుగున్నర లక్షల గ్రామాలను సంఘ స్వయంసేవకులు చేరుకోగలిగారన్నారు. దేశంలోని 56 వేల మండలాలలో షుమారు 50 వేల మండలాలకు స్వయంసేవకులు ఈ సందర్భంగా వెళ్ళగలిగారని, దేశ వ్యాప్తంగా ఇందులో పాల్గొన్న 11 లక్షల మంది కార్యకర్తలలో లక్ష మంది మహిళలు కూడా ఉండడం గమనార్హమని అన్నారు.
సంఘాన్ని తెలుసుకోవాలనుకునే కొత్తవారికి దేశంలోని వివిధ ప్రాంతాలలో సంఘ పరిచయ వర్గలు నిర్వహించడం జరుగుతుందని, అలా ఒక ప్రాంతంలోని (రాష్ట్రం) మొత్తం 10700 గ్రామాల్లో 8475 గ్రామాలను సంఘ కార్యకర్తలు చేరుకోగలిగారు. అలా ఆ ప్రాంతంలో పరిచయమైన క్రొత్తవారి కోసం 175 సంఘ పరిచయ వర్గలు నిర్వహించారన్నారు. ఆయా వర్గలలో మొత్తం 7000 మంది క్రొత్తవారు సంఘ పరిచయంలోకి వచ్చారని తెలిపారు. ఈ మొత్తం ప్రయత్నంలో 14 వేల మంది కార్యకర్తలు కృషిచేయడం గమనార్హమన్నారు.
సంఘ స్వయంసేవకులు సామాజిక పరివర్తన కోసం చేసే ప్రయత్నంలో భాగంగా గ్రామీణ వికాసం అనే ఒక గతి విధి కోసం పనిచేస్తుంటారని, అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలోని కొన్ని గ్రామాలలో కూడా వికాసం సాధించడం జరిగిందని తెలిపారు. వాటిలో కొన్ని… ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని కడుము, నెల్లూరు జిల్లాలోని ఇస్కపల్లి, ఖమ్మం జిల్లాలోని తనికెల వేజేర్ల, తెలంగాణా రాష్ట్రంలోని గంగదేవపల్లి వంటి గ్రామాలు అని తెలిపారు.
అలాగే గో సంవర్ధన్, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ వంటి గతి విధుల తోపాటు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణపై కూడా సంఘం దృష్టి సారించిందన్నారు.
ఈ విధంగా స్వయంసేవకులు సామాజిక పరివర్తనా కార్యంలో నిమగ్నమవుతున్నారని వివరించారు.
ఇంకా ఈ పాత్రికేయ సమావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు, అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ వాసుదేవరావు పాల్గొనారు.





