News

రాముడి ప్రాణప్రతిష్ఠ.. 500 ఏళ్ల లోతైన గాయానికి మందు : అమిత్‌ షా

289views

ఆయోధ్య రామజన్మభూమిలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. 500 ఏళ్ల క్రితం మొగల్‌ పాలకుడు బాబర్‌ కాలంలో ఏర్పడ్డ లోతైన గాయానికి మందు వేసినట్లు అయిందని హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. అహ్మదాబాద్‌లోని రణిప్‌లో పునర్‌నిర్మించిన శ్రీరామ మందిర పునఃప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్య రామమందిరంలో జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని అద్భుతమైన పనిచేశారు. 500 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులు ఈ క్షణం కోసమే వేచి ఉన్నారు. అయోధ్యలో కొలువైన రాముడు టెంట్‌ నుంచి ఆలయంలోకి ఎప్పుడు వెళతాడని గతంలో అడిగేవారు. ఈ భవ్యమందిరానికి ఇప్పుడు రాముడు తరలివెళ్లడంతో బాబార్‌ కాలంలో మన హృదయాలకు పడిన లోతైన గాయానికి ఇప్పుడు మందు వేసినట్లు అయిందని’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

‘‘మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మతవిశ్వాసాలు, భాషలను గౌరవించడానికి 2014 కంటే ముందున్న ప్రభుత్వాలు భయపడేవి. ఔరంగాజేబ్‌ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని ధ్వంసం చేస్తే.. దాన్ని పునర్‌నిర్మించి, కారిడార్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని మోదీయే. అయోధ్య రామమందిరాన్ని బాబర్‌ ధ్వంసం చేస్తే.. ఇప్పుడు మళ్లీ భవ్యాలయాన్ని నిర్మించి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.