News

రక్తి కట్టిస్తున్న కర్ణాటకం : 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా : సిద్దూని సీఎంని చేస్తే ఓకే – కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

143views

ర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో .. కుమారస్వామి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ విషయాన్నిస్పీకర్ కూడా ధ్రువీకరించారు. ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్-జేడీఎస్ హైకమాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నష్ట నివారణ చర్యల కోసం మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది. మిగతా కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే రామలింగ రెడ్డి నివాసానికి తరలిస్తున్నారు. ఇటు కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు తెలిసి ఆగమేఘాల మీద ఇండియా బయల్దేరారు.

కాంగ్రెస్ మార్కు రాజకీయం?

పరిస్థితులు ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమశేఖర్, బసవరాజు, శివరాం సిద్ధరామయ్యను సీఎం చేస్తే తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశారు.  ఇదంతా కాంగ్రెస్ మార్కు రాజకీయంలో భాగమని కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ నేపథ్యంలో కొందరు రాజకీయ పండితులు చేస్తున్న వాదన. “నిజానికి ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్, జేడీఎస్ ల ప్రభుత్వం పడిపోతే, సమీకరణలు మారి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం ఉంది. లేదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలించిన వారెవరైనా దీనిని అంచనా వెయ్యొచ్చు. ఈ విధంగా భాజపా బూచిని చూపి సీఎం కుమారస్వామిని లొంగదీసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహమయ్యుండ వచ్చు”. అని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. “తాను సీఎం పదవి చేపట్టననీ, ఆ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి రాజకీయ అస్థిరతను తొలగించామనీ సిద్దరామయ్య అధిష్టానం పెద్దలను వేడుకుంటున్నారు కదా?”  అని ప్రశ్నిస్తే… “కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన వారెవరైనా కర్ణాటక పరిణామాల వెనుక ఎవరున్నారనే విషయాన్ని తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు”. అని వారు వ్యాఖ్యానించారు.

అయితే కర్ణాటకలోని ఒక వర్గం మీడియా, ప్రధాన తెలుగు మీడియా మాత్రం కర్ణాటక పరిణామాల వెనుక భాజపా నేతల హస్తముందన్నట్లుగా చెబుతోంది. ఇది పూర్తిగా అసత్యమని కాంగ్రెస్, జేడీఎస్ ల కలహాల కాపురం ఎంతో కాలం సాగదన్న విషయం తమకు ముందే తెలుసునని, అయితే  ప్రస్తుత సంక్షోభానికి, తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నది భాజపా నేతల వాదన. అయితే కర్ణాటకం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనని రాజకీయ పార్టీలు, నాయకులు, పండితులు అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.