
తక్షణమే హిందూ కమిషన్ ఏర్పాటు చేసి, సభ్యులుగా పీఠాధిపతులు, స్వామీజీలను నియమించాలని మాజీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైందవం, హిందూ సంస్థల పరిరక్షణపై స్వామీజీలు, మఠాధిపతులు మాట్లాడారు. హిందూ డిక్లరేషన్ డిమాండ్‌పై చర్చించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ దేవాలయాలు, హిందూ సంస్థలను ప్రభుత్వ ఆధీనం నుంచి తొలగించాలన్నారు. దేవాదాయ అధికారులు, సిబ్బందికి ఇచ్చే జీతాల వ్యయాన్ని ఆలయాల నుంచి భరించకుండా.. ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.
గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ హిందూ సమాజం గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తుందో… ఆ పార్టీకే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. హిందూ సమాజం గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. హిందూ ధార్మిక పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ భూములకు రక్షణ లేదని, ఫలితంగా దేవాలయాలకు భూములు దానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో లక్ష మంది హిందువులతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సేవ్ టెంపుల్స్ ప్రతినిధి గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘువర్మ, శ్రీశైలం శివస్వామి, అరుణాచలం ఆదిశంకరాచార్య నిత్యాన్నదాన పీఠం స్వామీజీ అనిల్, హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్, హైందవ సేన అధ్యక్షుడు పీవీ రామారావు, కాశీకి చెందిన కిరణ్‌నాథ్‌జీ తదితరులు పాల్గొన్నారు.





