
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దనపూర్ గ్రామంలో ఒక ఆలయ పూజారిని అత్యంత పాశవికంగా దుండగులు కాల్చిచంపారు. కళ్లు పెరికేసి, మర్మావయాలు కోసేసి మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు. శనివారంనాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీంతో గోపాల్‌గంజ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సంఘటన వివరాల ప్రకారం, దనపూర్ జిల్లాలోని శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయాడు. అతని సోదరుడు అశోక్ కుమార్ బీజేపీ మాజీ డివిజనల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆలయానికి వెళ్లిన మనోజ్ కుమార్ కనపడకుండా పోవడంతో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఉదయం పూజారి మృతదేహం ఒక పొదల్లో కనిపించడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. పోలీసు నిర్లక్ష్యానికి నిరసనగా వారిపై రాళ్లు రువ్వుతూ, హైవేపై ఉన్న పోలీసు వాహనాలుకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విషయం తెలిసిన గోపాల్‌గంజ్ సదర్ సబ్-డివిజనల్ పోలీసు అధికారి ప్రాంజల్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, తగినన్ని పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు. హత్యా ఘటనపై విచారణ జరుపుతున్నామని, పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ప్రాంజల్ చెప్పారు. కాగా, తన సోదరుడు ఎక్కడికో వెళ్లి ఉంటాడని, తిరిగి వస్తాడని అనుకున్నామని, ఇంత దారుణంగా హత్యకు గురవుతాడని అనుకోలేదని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసిన ఆరు రోజుల తర్వాత తన సోదరుడి మృతదేహం కనిపించిందని, ఎందుకు ఆయన్ను చంపాల్సి వచ్చిందో, చంపినదెవరో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇచ్చినట్టు చెప్పారు.





