News

మూడు అత్యాధునిక యుద్ధనౌకలు సిద్ధం

205views

శత్రు జలాంతర్గాములను వేటాడటానికి ఉపయోగపడే మూడు అత్యాధునిక ఏఎస్‌డబ్ల్యూ యుద్ధనౌకలు భారత నౌకాదళంలో చేరడానికి రంగం సిద్ధమైంది. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వీటిని ప్రారంభించారు. వీటికి ఐఎన్‌ఎస్‌ మహె, ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌, ఐఎన్‌ఎస్‌ మాంగ్రోల్‌ అని పేర్లుపెట్టారు. నౌకాదళ ఉప అధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌, వ్యూహాత్మక దళాల విభాగం అధిపతి సురాజ్‌ బెర్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌ మాట్లాడుతూ.. భారత్‌కు అద్భుతమైన నౌకానిర్మాణ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది ఏఎస్‌డబ్ల్యూ నౌకలను నిర్మించేందుకు 2019లో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఇవి తీరప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడటం, సముద్రంలో మందుపాతరలు అమర్చడం, నిఘా.. తదితర విధులను నిర్వర్తించనున్నాయి. ఈ నౌకల్లో తేలికపాటి టోర్పిడోలు, రాకెట్లు, మందుపాతరలు, 30 ఎంఎం గన్స్‌, 12.7ఎంఎం స్టెబిలైజ్డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ గన్స్‌ ఉన్నాయి. ఈ నౌక గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. వీటిలో దేశీయంగా తయారు చేసిన సోనార్లు, సముద్రగర్భ నిఘా పరికరాలు ఉంటాయి. ఈ నౌకలో 57 మంది సిబ్బంది ఉంటారు.