News

నేత్రపర్వంగా భీమేశ్వరస్వామి తెప్పోత్సవం

267views

పంచారామ క్షేత్రమైన శ్రీబాలాత్రిపుర సుందరి సమేత కుమారరామ భీమేశ్వరస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. కార్తిక మాసంలో స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్‌ మేళాలు, వేదమంత్రాల మధ్య ఆలయ కోనేరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. వివిధ పుష్పాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన వేదికపై ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ పండితులు పూజాదికాలు నిర్వహించారు. ఈఓ టి.వెంకట సూర్యనారాయణ, తెప్పోత్సవం నిర్వహించే దాతలు వేదికపై పూజలు చేశారు. బాణసంచా కాల్పుల మధ్య స్వామి, అమ్మవార్లకు ఆలయ కోనేరులో హంస వాహనంపై తెప్సోత్సవం నిర్వహించారు. మూడు పర్యాయాలు స్వామివారి జలవిహారం కనుల పండువగా జరిగింది.