
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్‌కు వచ్చింది. వాఘా సరిహద్దు ద్వారా ఆమె స్వదేశంలోకి మళ్లీ అడుగు పెట్టింది.
పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో అంజూకు 2019లో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె.. అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. బుధవారం నస్రుల్లా సరిహద్దుదాకా ఆమె వెంట వచ్చి భారత్‌లోకి సాగనంపాడు. అంజూకు అప్పటికే వివాహమై 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో పెళ్లి చేసుకున్నాక ఆమె ఫాతిమాగా మారింది. ఈమె నిర్వాకంతో భారత్‌లోని కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో నస్రుల్లా ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె మానసిక వేదనతో సతమతమవుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. వాఘా వద్ద అంజూ మీడియాతో మాట్లాడుతూ ‘‘నా కుటుంబాన్ని కలిసేందుకు ఇష్టప్రకారమే భారత్‌కు వచ్చాను’’ అన్నారు.





