
దానం చేసేందుకు ధనవంతుడే అయి ఉండక్కర్లేదు. దానం చేసే మంచి గుణం ఉంటే చాలు. అందుకు ఈ యాచకుడే ఉదాహరణ. ఏ ఆలయం ముందు తాను భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ ఆలయం అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా అందించి తాను దానగుణ సంపన్నుడనని నిరూపించుకున్నాడతడు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబోలు కామరాజు సుమారు యాభై ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా చీపురుపల్లి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. జీవితం ఏదోలా సాగిపోతుందనుకునే సమయంలో కొన్నేళ్ల క్రితం అతని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో చీపురుపల్లిలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయం ముందు యాచకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టగా మొత్తం రూ.3 లక్షల ఐదు వేలు రూపాయలు జమ అయ్యాయి. ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని ఏ గుడి ముందు తాను భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ గుడి అభివృద్ధికే విరాళంగా అందించాడు. ఇటీవలే మరో 30 వేల రూపాయలు పట్టణంలోని రావివలస కూడలి సమీపంలోని భారీ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న షెడ్డు నిర్మాణానికి అందజేశాడు. ఇప్పుడు ఆయనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.





