News

కేరళలో రాజకీయ ప్రచారం కోసం హిందూ దేవాలయాన్ని ప్రచార వేదికగా మార్చిన సీపీఎం

248views

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పూజపురాలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన హిందూ దేవాలయ మండపాలను సీపీఎం పార్టీ తమ రాజకీయ ప్రచార వేదికగా మార్చుకుంది. ఆలయ సరస్వతీ నవరాత్రి మండపాన్ని ‘నవ కేరళ సాధన’ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ కార్యాలయంగా మార్చడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు, స్థానికుల నుండి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, సీపీఎం ఈ చర్యకు పూనుకున్నట్లు, పుణ్యక్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవటం ఆలయ పవిత్రతను దెబ్బతీయడమేనని స్థానికులు పేర్కొన్నారు. ఈ చర్యపై భక్తుల నుండి వ్యతిరేకత రావడంతో సీపీఎం సీనియర్ నాయకుడు, కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దేవాలయాల దగ్గర జెండాలు ఎగురవేయడం లేదా రాజకీయ సమావేశాలు నిర్వహించడంపై దేవస్వం బోర్డు నిషేధం విధించినప్పటికీ సీపీఐఎం ఈ చర్య తీసుకుందని, ఈ సంఘటనను కేరళ ప్రభుత్వం సమర్థించిందని స్థానిక నివాసి చెప్పారు.

ఆలయాన్ని దానిని అనుకొని ఉన్న మండపాన్ని ట్రావెన్‌కోర్‌ను పాలించిన అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ నిర్మించారని స్థానికులు తెలిపారు. సరస్వతి మండపాన్ని భక్తులు పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ పూజలు, భక్తి సంగీత ప్రదర్శనలు జరుగుతాయని, ఈ మండపం మకరజ్యోతి యాత్రికుల సమయంలో అయ్యప్ప పూజ కోసం ఉపయోగిస్తారని స్థానికులు వెల్లడించారు.