News

తిరువణ్ణామలై ఆలయంలో ప్రారంభమైన కార్తిక మహాదీపోత్సవాలు

314views

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు శుక్రవారం వేకువజామున ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కార్తిక మాసం కృత్తిక రోజున తిరువణ్ణామలై కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు అరుణాచలేశ్వరస్వామి, ఉన్నాములై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి.

ఆ తర్వాత పంచమూర్తులైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఉన్నాములై అమ్మన్‌ సమేత చంద్రశేఖరస్వామి, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మూడవ ప్రాకారంలో స్వామి సన్నిధి ఎదుట ఉన్న బంగారు ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. వేలాది మంది భక్తుల హరోం హరా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

5.45 గంటలకు ధ్వజారోహణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కె.పిచ్చాండి, జిల్లా కలెక్టరు కార్తికేయన్‌, ఆలయ సంయుక్త కమిషనర్‌ జ్యోతి, ఆలయ కమిటీ ఛైర్మన్‌ జీవానందం తదితరులు పాల్గొన్నారు. ఈ దీపోత్సవాలు 10 రోజులపాటు జరుగుతాయి.

ధ్వజారోహణ నిర్వహిస్తున్న వేద పండితులు

23వ తేదీ పంచరథాల ఊరేగింపు, 26వ తేదీ మహాదీపోత్సవాలు జరుగుతాయి. మహాదీపం వెలిగించడానికి 4,500 కిలోల ఆవు నేతిని కొనుగోలు చేశారు. వెయ్యి మీటర్ల గాఢా వస్త్రంతో ఒత్తిని తయారుచేశారు. ఉత్సవాల సందర్భంగా 14,500 మంది పోలీసులు భద్రతా విధులు చేపట్టారు. 2700 ప్రత్యేక బస్సులు, 24 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.